ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా అమూల్యమైనదని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరు ఓటరుగా నమోదు అయి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కమీషనరు ఆదర్శ్ సురభి అన్నారు.

ప్రచురణార్ధం:

జనవరి, 25 ఖమ్మం –

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా అమూల్యమైనదని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరు ఓటరుగా నమోదు అయి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కమీషనరు ఆదర్శ్ సురభి అన్నారు. 12 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా యువ ఓటర్ల నుద్దేశించి నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకొని ఓటుహక్కు పొందాలన్నారు. భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యంగం హక్కులతో పాటు విధులు, బాధ్యతలను కల్పించిందని అందులో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని ఆయన అన్నారు. ఓటరు నిర్భయంగా ఎటువంటి ఒత్తిళ్ళు, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కమీషనరు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యెందుకు ఎన్నికల సంఘం స్వీప్, ఓటరు అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా ఓటరు. అవగాహన చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, ఓటరు జాబితా సవరణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ఓటరు హెల్ప్ డెస్క్, ఆన్లైన్ ద్వారా ఓటరుగా నమోదు అయ్యె సౌలభ్యం కల్పించిందని, సంబంధిత యాప్లలో, వెబ్సైట్ల ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకో వచ్చని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అందరి భాగస్వామ్యంతో అందరిని కలుపుకొని ఎన్నికలు నిర్వహించాలనే అంశంతో ఈ సంవత్సరం 12 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని ఆయన అన్నారు. నూతనంగా ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకొని ఓటు హక్కు పొందిన ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని వెంకటపూజితా, సయ్యద్ రెహన్, తరుణ్ బాణాల, సమీనా నాక్రీస్, వర్షిత నారీలకు ఈ సందర్భంగా ఓటరు ఎపిక్ కార్డులను నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్ మధుసూదన్ అందజేశారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞను చేయించారు.

జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, స్వీప్ నోడల్ అధికారి శ్రీరామ్, కలెక్టరేట్ పరిపాలన అధికారి మదన్ గోపాల్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post