ప్రచురణార్థం
ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించాలి ….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
—————————–
పెద్దపల్లి, ఫిబ్రవరి – 06:
—————————–
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జిల్లాఅధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ లు వి.లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్ లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ ప్రజావాణిలో అందించిన అర్జీలను పరిశీలన చేసి సత్వరమే పరిష్కరించాలని తెలిపారు.
ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం (55) అర్జీలు రాగా, అందులో (39) అర్జీలు రెవెన్యూ శాఖకు చెందినవి కాగా, మిగిలిన (16) అర్జీలు ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి.
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన గుండెటి లక్ష్మి రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, సుల్తానాబాద్ తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన గోల్లె లక్ష్మి సర్వే నెంబర్ 257, 258, 255ఏ లో గల భూమి తన మరిది పేరుపై అక్రమంగా పట్టా చేశారని , దాన్ని రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, మండల తహసీల్దార్ కు రాస్తూ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
పెద్దపల్లి మండలంలోని బోంపల్లి గ్రామ యాదవ సంఘం సభ్యులకు కేటాయించిన సర్వే నెంబర్ 980లో మల్లన్న, భీరన్న, ఎల్లమ్మ గుడులు ఉన్నాయని, అక్కడ ప్రతి సంవత్సరం తమ సాంప్రదాయ వేడుకలు జరుపుతున్నామని, అట్టి భూములను ఇతర అవసరాలకు కేటాయించకుండా వాటికి హద్దులు నిర్దేశించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.