ప్రజా సమస్యల పట్ల సత్వరమే స్పందించే అధికారులు ప్రజల హృదయాల్లో చిరకాలంగా నిలిచిపోతారని. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 05 ఖమ్మం:

ప్రజా సమస్యల పట్ల సత్వరమే స్పందించే అధికారులు ప్రజల హృదయాల్లో చిరకాలంగా నిలిచిపోతారని. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ గా పనిచేసి సిరిసిల్లా జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన అనురాగ్ జయంతి ఆత్మీయవేడుకోలు సమావేశం ఆదివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని బదిలీపై వెళ్తున్న అనురాగ్ జయంతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఖమ్మంలో అనురాగ్ జయంతి వివిధ హోదాల్లో పనిచేసారని, ఖమ్మం సబ్ కలెక్టర్, కార్పోరేషన్ కమీషనర్ గా తనదైన శైలిలో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని మంత్రి అన్నారు. ప్రభుత్వ సూచనలు, ఆదేశాలను పాటిస్తూ ఖమ్మం నగరాభివృద్ధికి నగరపాలక సంస్థలో అనేక సంస్కరణలు చేపట్టి రాష్ట్రంలోనే ఖమ్మం కార్పోరేషన్కు ప్రత్యేక గుర్తింపు తేవడంలో కమీషనర్ కీలక పాత్ర పోషించారని, నగరంలో లకారం ట్యాంక్ బండ్, పార్యుల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల ఏర్పాటు, స్ట్రీట్ ఆర్ట్, వాకర్స్ ప్యారడైజ్, ఎన్.ఎస్.పి వాక్ వే, గోళ్ళపాడు. చానల్ ఆధునీకరణ పనులను ఛాలెంజ్ గా తీసుకొని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పారిశుధ్య పనులలో పలు సంస్కరణ చర్యలు చేపట్టారని, ఖమ్మం కార్పోరేషన్లో జరిగిన అభివృద్ధి చూసేందుకు ఇతర ప్రాంతాల నుండి అధికారుల బృందం పర్యటించడం ఖమ్మం నగరాభివృద్ధికి నిదర్శనమని మంత్రి అన్నారు. కోవిడ్ పరిస్థితులలో సమస్యలను అధిగమించడం, ప్రజా అవసరాలను గుర్తించేందుకు ప్రజాప్రతినిధులతో ప్రతి డివిజన్లలో సైకిల్ యాత్ర చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారంలో సత్వర చర్యలు చేపట్టడంతో ప్రత్యేక గుర్తింపు పొందారని, కమీషనర్ సేవలను మంత్రి కొనియాడారు. అదేవిధంగా నగరంలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరాకై 230 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులను సమర్ధవంతంగా పూర్తిచేసి ఇంటింటికి నల్లా కనెక్షన్ల ప్రక్రియను పూర్తి చేసారని, పట్టణ ప్రగతి ద్వారా నగరాభివృద్ధిలో భాగంగా నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఖమ్మం నగరానికే గర్వకారణంగా నిలిచాయని మంత్రి అన్నారు. నగరపాలక సంస్థ పాలక వర్గం నుండి ఒక్క విమర్శ లేకుండా తన పదవీ కాలంలో సమర్ధవంతంగా పనిచేసారని మంత్రి తెలిపారు. ఖమ్మం నగరాభివృద్ధి జరిగే సమయంలో నెల వ్యవధిలోనే ఇద్దరు ఐ.ఏ.ఎస్ అధికారులు జిల్లా నుండి బదిలీపై వెళ్ళడం కుటుంబ సభ్యులు జిల్లాను వదిలి వెళ్ళినట్టుగా ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

సిరిసిల్లా జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యుల అభివృద్ధి విజన్ కనుగుణంగా వేగవంతంగా పనిచేయడం సంతృప్తికరంగా ఉందని, ప్రజా సమస్యలపట్ల జిల్లా మంత్రివర్యులు పూర్తి అవగాహన కలిగి ఉండి తదనుగుణంగా అధికారులను ఆదేశిస్తూ నగరాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు. ఖమ్మం ప్రజలు పాజిటివ్ దృక్పదం కలిగి ఉన్నారని నగరపాలక సంస్థ రెండు పాలకవర్గంలో సమర్ధవంతమైన కార్పోరేటర్లు ఉండడం ద్వారా వారి సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించడం సులువైందని కమిషనర్ తెలిపారు. ‘నగర పాలక సంస్థ’ కార్యాలయపు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది మొదలుకొని చివరిస్థాయి సిబ్బంది సహకారంతోనే నగరాన్ని అభివృద్ధి పథంలో ఉంచగలిగామని ఆయన ఈ సందర్భంగా తెలుపుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, కార్పోరేటర్లు కర్నాటి కృష్ణ, క్లయిమెట్, వెంకట్రావు, మంజుల, కమరపు మురళి, ప్రశాంతి, అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరీ, డి.ఇ రంగారావు, తదితరులు మున్సిపల్ కమీషనర్ సేవలను కొనయాడుతూ అభినందించారు. నగరపాలక సంస్థ కార్పోరేటర్లు, సుడా డైరెక్టర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు కమీషనర్ను ఘనంగా సత్కరించారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post