ప్రజా సమస్యల పరిష్కరిణికి ప్రజావాణి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 13, 2021ఆదిలాబాదు:-

ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అధికారులు సమయపాలన పాటించి ప్రజావాణికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణిలో భూ సంబంధ సమస్యలు, పింఛన్ ల మంజూరు, ఉపకార వేతనాలు, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు అడ్మిషన్ లు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు వంటి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా సుమారు సంవత్సర కాలం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించలేక పోయామని, ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులో ఉన్నందున కరోనా నిబంధనలు పాటిస్తూ, ప్రజావాణి నిర్వహింస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజావాణికి సమయపాలన పాటిస్తూ తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. జిల్లాలో పలు ప్రాంతాల నుండి భూ సంబంధ సమస్యలపై వచ్చిన అర్జీదారుల నుండి పూర్తీ వివరాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి సంబంధిత రెవెన్యూ అధికారులకు, సంబంధిత విభాగం అధికారులకు అర్జీలను పంపించారు. రెండు పడక గదుల ఇళ్ళ మంజూరుకి ఎక్కువ దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన 57 సంవత్సరాల పైబడి వయసు కలిగిన వారికీ ఫించన్ ల మంజూరు చేయడం జరుగుతుందనే ప్రకటనతో అర్హులైన వారందరు ఫించన్ ల మంజూరుకు దరఖాస్తు చేసుకున్నామని, ఇప్పటి వరకు మంజూరు కాలేదని అర్జీదారులు కలెక్టర్ కు వివరించారు. వెనకబడిన తరగతుల కళాశాల విద్యార్థులకు ఉపకారవేతనాలు రాలేదని కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు. జిల్లాకు చెందిన CISF జవాన్ గొనె లక్ష్మణ్ విధి నిర్వహణలో మరణించిన కారణంగా వారి పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో హైదరాబాదులో చదువుతున్న వారికీ జిల్లాలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుకొనడానికి అడ్మిషన్ ఇప్పించాలని దరఖాస్తు సమర్పించారు. సిరికొండ మండలం వాయిపేట్ గ్రామానికి చెందిన పవార్ అంజలి నిర్మల్ జిల్లా ముధోల్ లోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ ఎంపీసీ సీట్ వచ్చిందని కానీ తనకు బీపీసీ సీట్ జిల్లాలో ఇప్పించాలని కలెక్టర్ ను కోరగా, గిరిజన సంక్షేమ శాఖ రీజినల్ కో ఆర్డినేటర్ తో కలెక్టర్ మాట్లాడి వెంటనే సీట్ వచ్చే విధంగా సహకరించాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి కలెక్టర్ సంయనంతో దరఖాస్తులను స్వీకరించి వాటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ జాడి రాజేశ్వర్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా మైనారిటి సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, జిల్లా దళిత అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి సునీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post