ప్రణాళికాబద్ధంగా పోడు భూ సమస్య పరిష్కారం:: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్

• నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు పోడు భూముల క్లెయిమ్స్ స్వీకరణ
• సాగవుతున్న అటవీ భూమి వివరాలను పకడ్భందిగా రూపొందించాలి
• అటవీ భూ కబ్జాదారుల పై అత్యంత కఠిన వైఖరి అమలు
• ప్రతి గ్రామంలో అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు
• పోడు సమస్యానంతరం ఇంచ్ భూమి సైతం ఆక్రమణకు గురికాకుండా గ్రామసభ తీర్మానం
• అడవుల పునరుజ్జీవనం చేసేదిశగా పటిష్టమైన చర్యలు
• పోడు భూముల పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాల పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎస్
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 05:- రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలని, అనంతరం ఒక్క ఇంచ్ అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పోడు భూముల పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై సీఎస్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్సు ద్వారా సమావేశం నిర్వహించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు నిర్ణయించారని తెలిపారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలో అధికారుల సహకారంతో చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరిగిందని ఆయన అన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమాయకమైన గిరిజనలు, ఇతర వర్గాలకు చెందిన పేదలకు నష్టం జర్గకుండా, అదే సమయంలో భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వారు దుర్వినియోగం చేయకుండా సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అడవుల సంరక్షణ కోసం క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో పాటు పార్టీలకతీతంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయి సహకరించాలని ఆయన కోరారు. అడవులను విధ్వంసం చేసే వారిని గుర్తించి వారిపై కఠినంగా వ్యవహరించాలని, పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సీఎస్ ఆదేశించారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 96 వేల 679 మంది పోడు రైతులకు 3 లక్షల 8 వేల 614 ఎకరాల భూమి ఆర్ఒఎఫ్ఆర్ పట్టాలను ప్రభుత్వం అందించిందని, ప్రస్తుత అంచనా ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా మరో 7 లక్షల 23 వేల 629 ఎకరాల అటవీ భూమిలో లక్షా 99 వేల 354 మంది పోడు సాగు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో అటవీ భూములలో సాగు చేసుకుంటున్న రైతుల వివరాలు సేకరించాలని, భూ కబ్జాదారులు, రియల్ స్టేట్ చేసే వారిని గుర్తించాలని అధికారులకు సూచించారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం అటవీ ప్రాంతాలు ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సభ, అటవీ హక్కుల కమిటి ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పారదర్శకంగా అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు చేయాలని, కమిటీల్లో ఎస్టీలు, మహిళా ప్రజాప్రతినిధులు ఉండే విధంగా చూసుకోవాలని సీఎస్ సూచించారు. మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో సైతం కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. నవంబర్ 8 నుండి డిసెంబర్ 8 వరకు నెల రోజుల పాటు పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, తదితరుల నుండి గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులను గుర్తించి వారికి పట్టాలు పంపిణీ చేస్తామని, అర్హులను గుర్తించి పట్టాలు ధృవీకరించే సమయంలో సీఎం ఆదేశాల మేరకు మరోసారి జిల్లాలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. పోడు భూముల సమస్య పరిష్కరించిన తరువాత గ్రామంలో మరో ఇంచ్ అటవీ భూమి ఆక్రమణకు పాల్పడకుండా సంబంధిత గ్రామ సభ తీర్మానించాలని సీఎస్ తెలిపారు. అడవి లోపల పోడు సాగు చేస్తున్న గిరిజనులకు సమీపంలోని ప్రభుత్వ భూములను సాగుకు కేటాయిస్తామని, ప్రభుత్వ భూములు లేని పక్షంలో అటవీ భూముల అంచున సాగు భూమిని కేటాయించి, వారికి నీరు, కరెంటు, నివాస సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో పోడు సాగుకు సంబంధించి పట్టాలు పంపిణీ చేసిన తరువాత మిగిలిన అటవీ భూమిని పకడ్బందీగా సంరక్షించుకోవాలని తెలిపారు. అటవీ సరిహద్దు ఏర్పాటు చేసి ఉపాధి హామి నిధులు, అటవీ నిధులు సంయుక్తంగా వినియోగిస్తూ చుట్టు ప్రహారీ గోడలు, ట్రేంచ్ లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. 10 ఎకరాల భూమి కొన్ని లక్షల మొక్కలతో సమానమని, దీనిని గుర్తించిన ప్రభుత్వం అడవుల పునరుజ్జీవనం చేసే దిశగా పకడ్భందిగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక వేయి 347 కోట్లు ఖర్చు చేసి 10 లక్షల 63 వేల ఎకరాల్లో 42 కోట్ల 41 లక్షల మొక్కలు నాటి అటవీ పునరుజ్జీవనం చేసామని సీఎస్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్, జిల్లా అటవీ అధికారిణి బాలామణి, ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి టి. శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post