*ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులకు దళితబంధు అమలు :: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్*

*ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులకు దళితబంధు అమలు :: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్*

*ప్రచురణార్థం-1*
*ఫిబ్రవరి 5 లోపు ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి*
*మార్చి 7లోపు యూనిట్ల గ్రౌండ్ పూర్తి*
*దళిత బంధు పథకం అమలు పై కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి*
రాజన్న సిరిసిల్ల, జనవరి 22 : మార్చి 7లోగా దళిత బంధు పథకం క్రింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మందికి లబ్ది చేకూర్చాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారులతో దళిత బంధు పథకం పై మంత్రి, సీఎస్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా తీసుకున్న కార్యక్రమం దళిత బంధువని, దేశంలోనే ప్రత్యేకంగా దళితుల కోసం తీసుకున్న గొప్ప పథకమని అన్నారు. రాష్ట్రంలోని హుజరాబాద్ నియోజకవర్గం, వాసాలమర్రి గ్రామం, మరో 4 మండలాలలో పూర్తిస్థాయిలో దళిత బంధు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ పరిధిలో కనీసం 100 మంది దళితులకు పథకం అమలు చేయాలని సీఎం నిర్ణయించారని మంత్రి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని పూర్తి చేయుటకు గ్రౌండ్ లెవెల్ లో లబ్ధిదారులను ఎంపిక చేసుకొని లక్ష్యం మేరకు లబ్ది చేకూర్చలన్నారు. దళిత బంధుతో నిరుపేద షెడ్యూల్ కులాలవారి ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాల్సిన అవసరముందని, జిల్లాలో దళిత బంధు అమలుకు అవసరమైన కమిటీలు ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని త్వరితగతిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
నిరుపేద దళిత కుటుంబాలలో ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నందున, అందుకు తగిన పథకాలను రూపొందించి అమలు పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ, అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఉన్న జిల్లా కలెక్టర్, సదరు అసెంబ్లీ కు ఉన్నతాధికారిని దళిత బంధు అమలు ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని ఫిబ్రవరి 5 లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. లబ్ధిదారులను గుర్తించే క్రమంలో ప్రతి నియోజక వర్గంలో సంబంధిత శాసన సభ్యుల ఆమోదంతో ముందుగా 100 మంది అర్హులైన లబ్దిదారులను గుర్తించి, జిల్లా కలెక్టర్, అధికారుల స్క్రూటినీ అనంతరం ఆ జిల్లా కు చెందిన మంత్రి సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.

ఎంపిక చేసిన లబ్దిదారులకు రెండు రోజుల్లో ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎంపిక చేసిన 100 మంది లబ్ధిదారులకు అవసరమైన శిక్షణ అందించి మార్చి 7లోగా లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దళిత బంధు ద్వారా ఎస్సీ లబ్దిదారులకు లబ్ది చేకూర్చాలని, తదనుగుణంగా మరింత మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని సకాలంలో యూనిట్లు గ్రౌండ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇట్టి వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్సీ కార్పోరేషన్ ఈడీ వినోద్ కుమార్, డీఆర్డీఓ కె. కౌటిల్య, డీఏఓ రణధీర్ కుమార్, సీపీఓ శ్రీనివాస చారి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post