ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు : జిల్లా ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి

జిల్లాలో ప్రజలందరికీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అందే విధంగా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, ఆదిలాబాద్‌ శాసనసభ్యులు పురాణం సతీష్‌, మంచిర్యాల, బెల్లంపల్లి శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌లతో కలిసి సంబంధిత శాఖల ప్రగతి నివేదికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పని చేయాలని, జిల్లాలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్య కోసం వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. జిల్లాకు మెడికల్‌ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు జవాబుదారితనంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రణాళికబద్దంగా చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ఆహార భద్రత చట్టం-2018 ప్రకారం లబ్టిదారులకు ప్రతి నెల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని, 2 లక్షల 18 వేల 475 మందికి ప్రతి నెల బియ్యం, సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని, నిరుపేదలకు అందవలసిన బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగకుండా క్షేతస్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. రాయితీ గొర్రెల పంపిణీ కార్యక్రమంపై సంబంధిత అధికారులు అన్ని మండలాలలో పర్యటిస్తూ పథకాన్ని పకదృంధీగా అమలు చేయాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని, ప్రభుత్వ అభివృద్ది పనుల వివరాలను ఎప్పటికప్పుడు అందేలా చూడాలని తెలిపారు. పంట మార్చిడి విధానం పట్ల రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి కొనుగోలు చేయకపోవడం పట్ల రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. గొర్రెలు, మేకల యూనిట్లను, గడ్డి కత్తిరించే యంత్రాలతో నహా రాయితీపై ప్రభుత్వం అందిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post