ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి – అదనపు కలెక్టర్ రమేష్

ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి – అదనపు కలెక్టర్ రమేష్

ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ఏ ఒక్క ఓటరు నమోదు కాకుండా మిగిలిపోరాదని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో స్వీప్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాల, కళాశాలలలో ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ నోడల్ అధికారులైనా ప్రధానాచార్యులు, ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలకు ఉద్దేశించి శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలో ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఎంతో కాలం వేచి చూడవలసి ఉండేదని, కానీ భారత ఎన్నికల కమీషన్ ఓటరు నమోదు, ఎన్నికల నిర్వహణలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం వల్ల నేడు ఓటరుగా నమోదు తో పాటు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కొన్ని గంటల వ్యవధిలో ఫలితాలు ప్రకటించగలుగుతున్నామని అన్నారు. ఎన్నికల కమీషన్ ఒక క్రమపద్ధతిలో ఎప్పటికప్పుడు తాజా నిర్ణయాలు తీసుకుంటూ, సంస్కరణలు చేపట్టడం వల్ల దేశంలో ఎన్నికలు సమర్థవంతంగా, సజావుగా నిర్వహించగలుగుతున్నామని అన్నారు. అట్టి వివరాలను కమీషన్ ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లో పొందుపరుస్తుందని, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎన్నికల పై అవగాహన కలిగి ఉండడంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఓటు హక్కు విలువ తెలపాలని సూచించారు. 9 నుండి ఇంటర్మీడియట్ చదువుచున్న యువతను ఫ్యూచర్ ఓటర్లుగా, డిగ్రీ ఆ పై చదువుచున్న వారిని యంగ్ ఓటర్లుగా పరిగణిస్తూ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా లిటరసీ క్లబ్ అధికారులు విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కలిగించాలని సూచించారు. ఓటరు హెల్ప్ లైన్ ద్వారా ఓటరు నమోదుతో పాటు , మార్పులు,చేర్పులు, సవరణలు, ఒక నియోజక వర్గం నుండి మరో నియోజక వర్గానికి మార్చుకోవడం వంటివి సులువుగా చేసుకోవచ్చని కాబట్టి ప్రతి విద్యార్ధి మొబైల్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునేలా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఆన్ లైన్ లో ఎప్పుడైనా ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు బూత్ స్థాయిలో అధికారులను ఏర్పాటు చేశామని అక్కడ కూడా పేరు నమోదు చేసుకోవచ్చని అన్నారు.
అదేవిధంగా ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైనది ఓటు హక్కని, మంచి సమాజం నిర్మించాలన్నా, సమాజంలో మార్పు తేవాలన్న ఓటు ఆయుధమని, కాబట్టి నైతికతతో ఓటు హక్కు వినియోగించుకునెలా అవగాహన కలిగించాలని సూచించారు. విద్యార్థులలో ఓటు పై అవగాహనతో పాటు దాని విలువ తెలిసి వారు తమ తల్లిదండ్రులకు, గ్రామస్థులకు తెలిపినప్పుడే ఈ శిక్షణా కార్యక్రమం సత్ఫలితాలు సాధించినట్లని ఆ విధంగా కృషి చేయాలని కోరారు. ఇప్పటి వరకు జరుగుచున్న ఎన్నికల సరళిని పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాలలో ఓటు హక్కు బాగా వినియోగించుకుంటున్నారని, పట్టన ప్రాంతాలలో మాత్రం వివిధ కారణాల చేత వినియోగించుకోలేక పోతున్నారని, ఆ శాతాన్ని పెంచేలా అవగాహన కలిగించాలని అన్నారు.
అనంతరం ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ లు సమర్థవంతంగా నిర్వహించడంపై పవర్ పాయింట్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ, స్వీప్ నోడల్ అండ్ జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శైలేందర్, సిబ్బంది, ఉపాద్యయులు పాల్గొన్నారు.

Share This Post