ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ తీసుకోవాలి : ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌ కుమార్‌

అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుండి వైద్య శాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, వైద్య శాఖ సంచాలకులు, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ గత వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నట్లయితే కరోనా వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. 18 సం॥ల వయసు గల జనాభా 2.8 కోట్ల మంది ఉన్నారని, వీరికి 5.6 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు 3.05 కోట్ల మందికి వ్యాక్సిన్‌ డోసులు వేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 93 లక్షల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయని, వీటిని జిల్లాలకు తరలించడం జరిగిందని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రం పరిధిలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి, ఇతర ఉన్నతాధికారులు నిరంతరం వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పర్యవేక్షించాలని, వ్యాక్సినేషన్‌ పర్యవేక్షణ కోసం ప్రతి గ్రామంలో ఆశ, అంగన్‌వాడీ, పంచాయితీ కార్యదర్శి, వి.ఆర్‌.ఏ., చౌకధరల దుకాణ డీలర్‌, గ్రామపంచాయతీ నోడల్‌ అధికారులతో మల్టీ డిసిప్లినరీ బృందం ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామానికి, వార్డులకు ప్రత్యేక అధికారులను నియమించాలని తెలిపారు. గ్రామాల్లో కొంత మేర ప్రజలు మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోలేదని, మరికొంతమంది మొదటి డోస్‌ తీసుకున్నప్పటికీ రెండో డోస్‌ తీసుకోవడం లేదని, వారిని గుర్తించి వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి వాక్సినేషన్‌ అందించాలని స్పెషల్‌ వ్యాక్సిన్‌ దైవ్‌ చేపట్టడం జరిగిందని, ప్రతి రోజు కనీసం 5 లక్షల వ్యాక్సిన్‌ డోసులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి, పట్టణాలలోని వార్డులకు ప్రత్యేక అధికారులను నియమించాలని, సామాజిక మాధ్యమాల్లో వ్యాక్సిన్‌ తీసుకోన్నట్లయితే ఆసరా పెన్షన్‌, రేషన్‌ను ప్రభుత్వం తొలగిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయని, వీటిపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని వయస్సు అర్హత గల ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసే విధంగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని, వ్యాక్సిన్‌ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పట్టణాల పరిధిలో ప్రతి వార్డులో, గ్రామాలలో వ్యాక్సినేషన్‌ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మొదటి డోసు వ్యాక్సినేషన్‌ 98 శాతం పూర్తి చేయడం  జరిగిందని, రెండవ డోసు సైతం పూర్తి స్థాయిలో చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుబ్బారాయుడు,
ముఖ్య ప్రణాళిక అధికారి నరేందర్‌, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post