ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుండేందుకు ప్రభుత్వం కృషి

ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుండే విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టి అమలు చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం జిల్లాలోని చెన్నూర్‌ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసనసభ్యులు బాల్క సుమన్‌, జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, శాసన మండలి సభ్యులు పురాణం సతీష్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్మన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభా సింగ్‌తో కలిసి హాజరయ్యారు. కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి దృష్ట్వా ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టి అమలు చేస్తుందని, ఈ నేపథ్యంలో 4వ విడతలో ్రతి గ్రామం పరిశుభ్రంగా, పచ్చదనంతో విలసిల్లాలని అన్నారు. గ్రామాలన్నీ శుభ్రంగా ఉండేందుకు ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాల కోసం వైకుంఠధామం (శ్మశానవాటిక) ఏర్పాటు చేయడం జరిగిందని, హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోయడంతో పాటు చెత్త, చెదారాన్ని డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు ట్రాక్టర్లు, ట్రాలీలు అందించడం జరిగిందని తెలిపారు. వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఏ విద్యార్థి పైవేట్‌ పాఠశాలలకు వెళ్ళకుండా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించడం జరిగిందని, తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్ధేశిత లక్ష్యాలను సాధించాలని, ప్రతి ఇంట్లో 6 మొక్కలు నాటి సంరక్షించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. అర్హులైన వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులతో పాటు ఒంటరి మహిళలకు పెన్షన్‌ అందించడం జరుగుతుందని, పేదింటి ఆడపడుచులకు ఇంటి పెద్దగా 1 లక్షా 50 వేల రూపాయలు అందించడం జరుగుతుందని, గర్భిణులకు కె.సి.ఆర్‌. కిట్‌ అందించడంతో పాటు 18 వేల రూపాయలు అందించి ప్రసవం తరువాత జాగ్రత్తగా ఇంటికి చేర్చడం జరుగుతుందని, అర్హులైన ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వడం జరుగుతుందని, 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్‌ భగీరథ ద్వారా గోదావరి నది నుండి ప్రతి నివాసానికి త్రాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ రైతుబంధు, రైతు భీమా పథకాలు అమలు చేయడంతో పాటు 10 వేల కోట్ల రూపాయలు అర్హులైన రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని, పట్టణాల ఆధునీకరణ కోసం పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, ప్రభుత్వ ఆసుపత్రులలో పేద వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, విద్యార్థినీ, విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. దళిత సాధికారత పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి 4వ విడత కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నుండి జిల్లా కలెక్టర్‌ వరకు అధికారులు ప్రత్యేక చొరవ చూపడం చాలా సంతోషకరమైన విషయమని, పల్లెప్రగతితో గ్రామాలన్నీ బాగుపడ్డాయని తెలిపారు. 7 కోట్ల మొక్కలు అడవులలో పెంచడం జరుగుతుందని, 15 వేల నర్సరీలలో మొక్కలు సిద్దంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని, భావి తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించిన వారమవుతామని అన్నారు. ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పల్లెప్రగతి కార్యక్రమంలో 12 వేల గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో మహా యజ్ఞంలా సాగుతుందని, పల్లెసీమలు అభివృద్ధి దిశగా వివిధ రకాల కమిటీలు వేసి కార్యచరణ రూపొందించాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలన్ని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, చెన్నూర్‌ నియోజకవర్గ పరిధిలో ప్రజల సౌకర్యార్థం వంతెనలు, రోడ్లతో పాటు కిష్టంపేటలోని డిగ్రీ కళాశాలలో పల్లెప్రకృతి వనం కోసం స్థలం కేటాయించాలని అన్నారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం గొప్ప కార్యక్రమమని, కాలుష్యం లేని వాతావరణం అందించడం ద్వారా భవిష్యత్‌ తరాలు బావుంటాయని, పల్లెలు పరిశుభ్రంగా ఉంచుకుందాం – అందరం ఆరోగ్యంగా ఉందామని తెలిపారు. శాసనమండలి సభ్యులు మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యపడుతుందని, మన ఇంటితో పాటు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కరోనా సమయంలో ఆక్సిజన్‌ అందక ఎంతో మంది చనిపోయారని, మొక్కలు నాటి ఆరోగ్యకరమైన వాతావరణం పెంపొందించుకుందామని అన్నారు. అనంతరం భీమారం మండలంలోని జోడువాగు సమీపంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post