ప్రతి టీం రోజు వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలి – బతుకమ్మ చీరలు మంగళం వరకు పూర్తిగా పంపిణీ జరగాలి – కలెక్టర్

వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయడానికి 360 టీమ్లను ఏర్పాటు చేశామని ప్రతి టీం ప్రతిరోజు వంద మందికి వ్యాక్సినేషన్ చేయాలని ఆదేశించామని కానీ అనుకున్న మేర జరగడం లేదని, అధికారులు ఈ దిశగా లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని బతుకమ్మ చీరలు ఇంకా 20 శాతం పంపిణీ మిగిలి ఉన్నందున మంగళవారం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం ఆయన జిల్లా అధికారులతో పలు విషయాలపై మాట్లాడారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో టీఎస్ ఐపాస్ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయడం ద్వారా థర్డ్ వేవ్ వైరస్ రాకుండా అరికట్టడానికి వీలవుతుందని అందువల్ల అధికారులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చి మంగళవారం నుండి ప్రతిరోజు ప్రతి టీమ్ ఆధ్వర్యంలో కనీసం రోజుకు వంద మందికి తక్కువ కాకుండా వ్యాక్సినేషన్ చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో గ్రామ కార్యదర్శులు ఇతర అధికారులు సహకారం అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలు ఇంకా 20 శాతం వరకు పంపిణీ కావాల్సి ఉన్నందున అధికారులు మంగళవారం కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

Share This Post