ప్రతి నెల ఒకటవ తేదికి జిల్లాలోని అన్ని చౌకధర దుకాణాలకు బియ్యం సరఫరా అయి వినియోగదారులకు అందుబాటులో ఉండాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎస్. మోతిలాల్

ప్రతి నెల ఒకటవ తేదికి జిల్లాలోని అన్ని చౌకధర దుకాణాలకు బియ్యం సరఫరా అయి వినియోగదారులకు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎస్. మోతిలాల్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం తన ఛాంబర్ లో జిల్లా సివిల్ సప్లై అధికారి ఆధ్వర్యంలో స్టేజ్-1, స్టేజ్-2 గోదాముల ఇంచార్జ్ లు, మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదవానికి ఇవ్వాల్సిన రేషన్ బియ్యం ప్రతి నెల ఒకటవ తేదీన కాకుండ పది రోజుల తర్వాతా ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. ఒక పేదవాడు బియ్యం కొరకు తన పని వదిలేసి రోజు బియ్యం వచ్చిందా అని డీలర్లకు అడగాల్సిన ఆగత్యం ఎందుకు వస్తుందని స్టేజ్-1, స్టేజ్-2 గోదాముల అధికారులను నిలదీశారు. ఇక నుండి జిల్లాలో అలా జరగడానికి వీలు లేదని ప్రతి నెల ఒకటవ తేదీన రేషన్ బియ్యం పంపిణీ జరగాలని అందుకు తగిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలన్నారు. స్టేజ్-1 నుండి స్టేజ్-2 కు బియ్యం తరలింపు ప్రతి నెల 24వ తేదీన ప్రారంభం అయి రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. స్టేజ్-2 నుండి నెల చివరి నాటికి అన్ని చౌకధర దుకాణాలకు చేరిపోవాలని ఆదేశించారు. బియ్యం రవాణా డీలర్లు ఒప్పందం ప్రకారం 25 లారీలు పెడతామని అందుకు అనుగుణంగా లారీలు పెట్టకపోవడం సరికాదన్నారు. గోదాములలో హమాలిలా సమస్య రాకుండా చూసుకోవాలని జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ ను ఆదేశించారు. బియ్యం సరఫరాలో ఉదారంగా ఉండటానికి వీలు లేదని, పేదవానికి సకాలంలో బియ్యం అందించటం అందరి బాధ్యత అని సూచించారు.
రైతుల వరి ధాన్యం కొనుగోలు విషయంలో మాట్లాడుతూ రైతులకు పంట అమ్మిన 48 గంటల్లో వారి అకౌంట్ లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, ధాన్యం మిల్లుకు తరలించి ఆన్లైన్ కంప్యూటరీకరణ చేయడంలో ఆలస్యం వల్ల రైతులకు సకలంలో సబ్బులు జమ చేయలేకపోతున్నామన్నారు. ధాన్యం సేకరించిన వెంటనే మిల్లుకు తరలించాలని, అక్కడ తూకం పూర్తి అయిన వెంటనే కంప్యూటర్ లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు, పేదవానికి ఇబ్బందులు కలుగకుండా సేవచేయడం ప్రధాన ఎజెండాగా పని చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా చౌకధర దుకాణం నుండి గన్ని బ్యాగులు తిరిగి వసూలు చేయాలని, ఒక్కో బ్యాగుకు రూ. 21 చెల్లిస్తున్నామని, తిరిగి గోదాములను ఇవ్వకుండా బయట అమ్ముకుంటే అలాంటి డీలర్ల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ బాలరాజు, స్టేజ్-1,2 అధికారులు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post