ప్రచురణార్థం
ప్రతి పేద బిడ్డకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి – పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
*ప్రతి పేద బిడ్డ గొప్పగా చదవాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష
*ప్రైవేట్ కు ధీటుగా సర్కారు బడులలో వసతుల కల్పన…. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
*చక్కటి బోధన కల్పించి విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడాలి
*విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం తొలిమెట్టు కార్యక్రమం అమలు
*మన ఊరు మన బడి కార్యక్రమంలో పనులు పూర్తి అయిన మోడల్ పాఠశాలను ప్రారంభించిన ఎమ్మేల్యే, జిల్లా కలెక్టర్
—————————–
పెద్దపల్లి, ఫిబ్రవరి -04:
—————————–
ప్రతి పేద బిడ్డకు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటుకు ధీటుగా సర్కారు బడులలో వసతులను కల్పిస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు.
పెద్దపల్లి మండలం దర్గా రాఘవాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 25.07 లక్షల వ్యయంతో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా కల్పించిన సౌకర్యాలను శనివారం పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే వారిలో పేదవారు ఎక్కువ ఉంటారని, వారు చక్కగా ఏ ఆటంకం లేకుండా అన్ని సౌకర్యాలతో చదివేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, 7,289 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మన జిల్లాలో మొదటి దశలో 191 పాఠశాలలను ఎంపిక చేసి మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు .
ప్రజలు గతానికి, ప్రస్తుతానికి చెందిన మార్పులు గమనించాలని, గతంలో ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయని,
మరమ్మత్తులు, రంగులు వేసుకొని పాఠశాలను శుభ్రంగా, చక్కటి బెంచిలను, గ్రీన్ చాక్ బోర్డ్, ఫ్యాన్, టాయిలెట్ మొదలైన వసతులు కల్పించినట్లు తెలిపారు.
ఈనాటి బాలలు రేపటి పౌరులు అని, వారి భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను మనం కాపాడుకొని భవిష్యత్తులో అందరూ సద్వినియోగం చేసుకొని మన పిల్లలు ఉన్నత స్థితికి వెళ్లే విధంగా తరచూ పాఠశాలకు వచ్చి పిల్లల చదువుతున్న తీరును పరిశీలించి, ఉపాధ్యాయులతో మాట్లాడాలని ఎమ్మెల్యే సూచించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద జిల్లాలో మొదటి దశలో 191 పాఠశాలలో 12 రకాల పనులు చేపట్టడం జరిగిందని అన్నారు.
పాఠశాలలో మంచినీటి సరఫరా, రన్నింగ్ వాటర్ తో టాయిలెట్స్ నిర్మాణం, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్ నిర్మాణం, పెయింటింగ్, విద్యుత్ పనులు, ఫర్నిచర్ వంటివి పూర్తి చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదివే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పాఠశాలల్లో ఉన్న గ్రౌండ్ ను లెవెల్ చేసి పరిసరాలను శుభ్రం చేశామని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పనులు పూర్తి చేయడంలో చేసిన కృషి అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు.
ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు గత అక్టోబర్ మాసం నుంచి తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తున్నామని, పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తరచూ పాఠశాలకు వచ్చి పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో పాల్గొనాలని, మెరుగైన వసతుల కల్పనకు సూచనలు అందించాలని కలెక్టర్ కోరారు.
జిల్లాలో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, అవసరమైన స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశామని, వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో సంచార ప్రయోగశాలను ఏర్పాటు చేసి ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం పెరిగే విధంగా చర్యలు తీసుకున్నామని, ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, సర్పంచ్ ఆడేపు వెంకటేశం, పెద్దపల్లి జెడ్పిటిసి బండారి రామ్మూర్తి , ఎంపిపి బి. స్రవంతి, ఎంపిటిసి తోట శ్రీనివాస్, ఎస్.ఎం.సి. చైర్మన్ కె. సదయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, తహాసిల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీవో రాజు, మండల ప్రత్యేక అధికారి, మండల విద్యా శాఖ అధికారి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.