ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వ్యాక్సిన్ తీసుకోవాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

వచ్చే బుధవారం లోగా ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సహిస్తూ నివేదికలు సమర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో వ్యాక్సినేషన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ పై ప్రత్యేక ద్రుష్టి సారించిందని, ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. ఆయా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు వారు తీసుకున్న వ్యాక్సిన్ వివరాలు, ఆధార్, మొబైల్ నంబర్ తదితర వివరాలు నిర్ణిత ప్రొఫార్మాలో సమర్పించవలసిందని ఆదేశించగా కేవలం పది శాఖల నుండి నివేదికలు అందాయని, వచ్చే బుధవారం లోగా అన్ని శాఖల నివేదికలు వందశాతం వ్యాక్సినేషన్ అయినట్లుగా సమర్పించాలని అన్నారు. వచ్చే శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు తీసుకున్న వ్యాక్సినేషన్ వివరాలను సమర్పించవలసి ఉందని కనుక ప్రతి ఒక ఉద్యోగి వ్యాక్సిన్ తీసుకోవాలని అట్టి బాధ్యత సంబంధిత అధికారులదేనని అన్నారు. సూపర్ స్ప్రెడార్ లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. అనంతరం గ్రామాలలో చేపడుతున్న పారిశుద్యం, మౌలిక సదుపాయాలు, ఇంటి పన్ను వసూళ్లు, సేగ్రిగేషన్ షెడ్, పార్కుల నిర్వహణ, నర్సరీల ఏర్పాటు, ఇంటింటి తడి,పొడి చెత్త సేకరణ, తరలింపు వంటి అంశాలపై పంచాయితీ సిబ్బందితో సమీక్షించారు. పంచాయితీ కార్యదర్శులు, జూనియర్ పంచాయితీ కార్యదర్శులు, మల్టి పర్పస్ వర్కర్ల వేతనాలు సమయానికి చెల్లించాలని అన్నారు. ట్రాక్టర్ లు, ట్రాలీల రుణాలు, విద్యుత్ చార్జీలు సమయానికి చెల్లించాలని అన్నారు. గ్రామాలలో ప్రతి రెండు మాసాలకు ఒకసారి గ్రామసభలు నిర్వహించి గ్రామాల్లోని సమస్యలు, తీసుకుంటున్న చర్యలపై చర్చించాలని సూచించారు. గ్రామస్థాయిలో చేపట్టే హరితహారం కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖల సహకారంతో నిర్వహించాలని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని, సూపర్ స్ప్రెడార్ లకు ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు, గర్భవతులు, బాలింతలు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకున్న వివరాలు వెంటనే సమర్పించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.విజయ సారధి, LDM చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, సంక్షేమ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post