రేషన్ దుకాణాలు సమయ వేళలు పాటించాలి -అదనపు కలెక్టర్ రమేష్

రేషన్ దుకాణాలు సమయ వేళలు పాటించాలి -అదనపు కలెక్టర్ రమేష్

చౌక ధర దుకాణ డీలర్లు ఖచ్చితంగా సమయ వేళలు పాటించి షాపులు తెరవాలని, లేకుంటే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ రమేష్ హెచ్చరించారు. శుక్రవారం తన ఛాంబర్ లో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తో కలిసి చౌక ధర దుకాణాల మండల అధ్యక్షుల తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సమయం వేళలు పాటించడం లేదని, బియ్యం సక్రమంగా పంపిణి చేయడం లేదని పలు ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. జిల్లాలో ఉన్న 521 రేషన్ దుకాణాలకు గాను 52 ఖాళీగా ఉన్నాయని, ఆ దుకాణాలలో కొందరు డీలర్లు నెలలో 4,5 రోజులు మాత్రమే తెరవడం వలన ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు, అధికారులతో మొరపెట్టుకుంటున్నారని, కలెక్టర్ కూడా సీరియస్ గా ఉన్నారని, కాబట్టి ఇట్టి సంఘటనలు పునరావృత్తమైతే డీలర్ షిప్ రద్దు చేయుటకు వెనుకాడబోమని రమేష్ హెచ్చరించారు. ప్రధానంగా హవేలీ ఘనపూర్, రేగోడ్, కొల్చారం, చేగుంట, పెద్ద శంకరంపేట వంటి మండలాల్లో అలసత్వం బాగా కనిపిస్తుందని అన్నారు. ప్రతి మాసం మొదటి రోజు నుండి 15 రోజుల వరకు క్రమం తప్పకుండ వేళకు షాపు తెరచి లబ్దిదారులకు బియ్యం పంపిణి చేయాలని అన్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు. బియ్యాన్ని గన్ని సంచులు పెట్టి తూకం వేయకుండా వినియోగదారుడు తెచ్చిన సంచి ద్వారా మాత్రమే తూకం వేయాలని అన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనందున ఖాళీ అయిన గన్ని సంచులను సమీప కొనుగోలు కేంద్రాలకు లేదా గోదాములకు అందజేయాలని సూచించారు. కొందరు అట్టి సంచులను బయట విక్రయించుకుంటున్నారని, అటువంటి వారిపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిర్ణీత వేళలో షాపులు తెరవక పోయిన, గన్ని సంచులు అప్పగించక పోయిన నోటీసులు ఇచ్చి తొలగిస్తామని రమేష్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని మండలాల రేషన్ డీలర్ల అధ్యక్షులు, పౌర సరఫరాల శాఖా సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post