ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను వారం ముగిసే లోపల పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను వారం ముగిసే లోపల పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి హాల్లొ అదనపు కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అక్కడే ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫెరెన్సు ద్వారా ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలిస్తూ సంబంధిత మండలం నుండి జిల్లా ప్రజావాణీకి వచ్చిన ప్రజావాణి ఫిర్యాదుల పై సంబంధిత తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి అక్కడిక్కడే తగు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఈ రెండు నెలల నుండి మొత్తం 248 ఫిర్యాదులు ప్రజావాణి ద్వారా రావడం జరిగిందన్నారు. ఇందులో చాలా వరకు పరిష్కారమైనప్పటికి ని ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయని వాటన్నింటిని వచ్చే శుక్రవారం లోపు పరిష్కరించాలని అధికారులను, తహశీల్దార్ లను ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదులలో అత్యధికంగా జిల్లా పంచాయతీ అధికారి వద్ద పెండింగ్ ఉన్నాయని, మిగిలినవి కొన్ని తహశీల్దార్ల వద్ద పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. వీటన్నింటినీ వచ్చే శుక్రవారం లోపు పరిష్కరించి ప్రజావాణి లాగిన్ లో అప్లోడ్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ రోజు ప్రజావాణిలో 22 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదును సకాలంలో పరిష్కరించి వెంటనే ఆన్లైన్ లో సైతం అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలియజేసారు. వచ్చే సోమవారం ఇంకా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులపై సంబంధిత అధికారిని నిర్లక్ష్యానికి కారణాలను ప్రశ్నించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో వ్యయప్రయాసలకోర్చి తమ సమస్యలను ప్రజావాణి ద్వారా ఫిర్యాదులు చేస్తారని, వాటికి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అట్టి ప్రతిని ఫిర్యాదు దారునికి పంపించి ఆన్లైన్ లో సైతం అప్లోడ్ చేయాలని తద్వారా పారదర్శకత, నమ్మకం ఏర్పడుతుందన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

Share This Post