ప్రత్యక్ష బోధనా తరగతుల ప్రారంభానికి పకడ్బందీ చర్యలు:: జిల్లా కలెక్టర్ కె. నిఖిల

ప్రత్యక్ష బోధనా తరగతుల ప్రారంభానికి పకడ్బందీ చర్యలు:: జిల్లా కలెక్టర్ కె. నిఖిల

జనగామ, ఆగస్టు 26: జిల్లాలో విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనా తరగతుల ప్రారంభానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. నిఖిల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యా శాఖ, సంక్షేమ గురుకుల విద్యా సంస్థల అధికారులు, ఎంపిడివోలు, ప్రయివేటు విద్యా సంస్థల బాధ్యులతో జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష బోధనా తరగతులు ప్రారంభించడానికి చేపట్టాల్సిన చర్యలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సుమారు 16 మాసముల తర్వాత విద్యా సంస్థలు ప్రత్యక్ష బోధనకు సిద్దం అవుతున్నందున పారిశుద్ధ్య చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల లోపల, పరిసరాలు పరిశుభ్రం చేయాలన్నారు. పరిసరాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, ఎక్కడా నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలో వంటగది, టాయిలెట్లు, నీటి ట్యాంకులు శుభ్రం చేయాలన్నారు. ఫినాయిల్, డెటాల్ తదితర టాయిలెట్ శుబ్రపరిచే సామాగ్రి అవసరం మేరకు సమకూర్చుకోవాలన్నారు. నీరు నిల్వ వున్న ప్రాంతాల్లో నీటిని తొలగించి, ఫాగింగ్, యాంటి లార్వా చర్యలు చేయాలని, తిరిగి నీరు నిల్వకుండా చూడాలని, అవసరమైతే ఇంకుడుగుంతల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. చిన్న చిన్న మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలని, అవసరమైతే వైట్ వాష్ చేయాలని ఆమె తెలిపారు. పాఠశాల ప్రతి గదిని సోడియం హైపోక్లోరైడ్ తో సానిటైజ్ చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో ధర్మల్ స్కానర్ సమకూర్చుకొని, ప్రతి విద్యార్థికి పరీక్షించి అనుమతించడానికి ప్రవేశద్వారం వద్ద ఒక బాధ్యతాయుత వ్యక్తిని ఏర్పాటుచేయాలని కలెక్టర్ అన్నారు. ఏ ఒక్క విద్యార్థికి లక్షణాలు కనిపించిన వెంటనే తదుపరి పరీక్షలకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలానికి ఒక ఆర్బిఎస్కే వాహనాన్ని సంచార పరీక్షా వాహనాలుగా వినియోగించాలన్నారు. ఇట్టి వాహనాల బాద్యుల వివరాలు సంబంధిత మండలంలోని ప్రతి విద్యా సంస్థ వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులు, బోధనా, బోధనేతర సిబ్బంది అందరు విధిగా మాస్క్ ధరించాలని, మాస్క్ లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని ఆమె తెలిపారు. విద్యార్థులు, బోధనా, బోధనేతర సిబ్బంది అందరికి ఒక్కొక్కరికి రెండేసి మాస్కులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పూర్వ విద్యార్థులు, దాతల ద్వారా మాస్కులు సమకూర్చుకోవాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో సరిపోను పడకలు, గదులు ఏర్పాటుచేసుకోవాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందేలా చూడాలని, లేనిచో సంబంధిత ఏఇ ని సంప్రదించి చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యా సంస్థ ప్రదానోధ్యాయులు మిషన్ భగీరథ నీరు లభిస్తున్నట్లు ధృవీకరణ సమర్పించాలని ఆమె అన్నారు. మధ్యాహ్న భోజనానికి విద్యా సంస్థలకు బియ్యం పంపిణీ చేయాలని జిల్లా పౌరసరఫరాల మేనేజర్ ని కలెక్టర్ ఆదేశించారు. మద్యాహ్న భోజనానికి క్లాసులు, విద్యార్థుల సంఖ్యను బట్టి, స్థల లభ్యతను బట్టి విడతలుగా ఏర్పాట్లు చేయాలని, ఒక విద్యార్థికి మరొక విద్యార్థికి భౌతిక దూరం పాటించాలని ఆమె అన్నారు. భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రపరచుకోవడానికి సబ్బు, సానిటైజర్ అందుబాటులో ఉంచాలన్నారు. పాఠశాలల ప్రారంభ సమయానికి పిల్లల రవాణాకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టిసి బస్సులు ఏర్పాటుచేయాలన్నారు. పరిశుభ్రత అనేది నిరంతర ప్రక్రియ అని, పంచాయతి సిబ్బంది ప్రతిరోజు విద్యా సంస్థల పారిశుద్ధ్యం చేపట్టాలని ఆమె అన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కల సంరక్షణకు వాచ్ అండ్ వార్డ్ ఏర్పాటుచేయాలన్నారు. పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, కోవిడ్ నియంత్రణా చర్యలపై చైతన్యం చేయాలని ఆమె తెలిపారు. జిల్లాలో ఎక్కడా ఏ చిన్న లోపం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అన్ని విధాల ముందస్తు చర్యలు చేపట్టి, ఈ నెల 30 లోగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జనగామ మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, జిల్లా విద్యాధికారి కె. రాము, జెడ్పి సిఇవో ఎల్. విజయలక్ష్మి, డిఆర్డివో జి. రాంరెడ్డి, డిపివో కె. రంగాచారి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సంధ్య, జిల్లా అధికారులు, ఎంపిడివోలు, మండల విద్యాదికారులు, ప్రయివేటు విద్యా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post