ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రచురణార్థం-1
జనగామ, డిసెంబర్ : 06 సోమవారం జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ పై చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, జాఫర్ ఘడ్ మండలాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై క్షేత్ర స్థాయిలో పూర్తి అవగాహన కల్పించే విధంగా ప్రత్యెక కార్యాచరణ చేపట్టాలన్నారు. జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు. వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసి రెండవ డోసు కు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
యాసంగి లో వరి ధాన్యానికి బదులుగా పన్నెండు రకాల ఆరుతడి పంటలు వేసి వాటిపై వచ్చే లాభాల గురించి రైతులకు పూర్తి అవగాహాన కల్పించి ప్రచారం నిర్వహించాలన్నారు. రైతులందరూ వరికి ప్రత్యామ్నాయంగా పన్నెండు రకాల పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. యాసంగిలో వేరుశెనగా, నువ్వులు, పప్పు దినుసులు తదితర పంటలను సాగు చేయాలని సూచించారు. వీటిపై సలహాలు, సూచనలకోసం హెల్ప్ లైన్ నెంబర్ 72888 94712 ఏర్పాటు చేసినందున రైతులు వారి సందేహాలను హెల్ప్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు.
ధాన్యం కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించి కేంద్రాలలో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు వెంట వెంటనే తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. జాఫర్ ఘడ్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలన్నారు. ప్రజలకు అందిస్తున్న ఇతర వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కరోనాను నియంత్రి౦చేందుకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, బౌతిక దూరం పాటించేలా ప్రతీ ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. చేల్పూరు మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించి మట్టిని శుద్ధి చేసి బ్యాగుల ఫిల్లింగ్ చేపట్టాలన్నారు. ఇచ్చిన లక్ష్యం ప్రకారం బ్యాగుల్లో మట్టి నింపి సిద్దంగా ఉంచాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, స్టేషన్ ఘనపూర్ ఆర్డీఓ కృష్ణవేణి, ప్రత్యేక అధికారి రామాచారి, తహసిల్దార్లు, ఎంపిడిఓ లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post