ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రచురణార్థం-3
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 6: యాసంగిలో లో భారత ఆహార సంస్థ ధాన్యం కొనుగోలు చేయడం లేనందున, ధాన్య కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఉండదని, కావున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే సీజన్ లో ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేదని రైతులకు తేల్చి చెప్పాలని ఆయన అన్నారు. యాసంగిలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, మినుములు, శనిగలు, పెసర్లు, నువ్వులు, ధనియాలు, ఆముదాలు, ఆవాలు, బబ్బర్లు, కుసుమలు, పొద్దుతిరుగుడు తదితర పంటల సాగు చేసి లాభం పొందేలా అవగాహన కల్పించాలని సూచించారు. రైతు సమూహాలతో గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటుచేసి, పంట వైవిధ్యం పై చైతన్యం తేవాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు లాభసాటిగా వుంటాయని, మార్కెట్ లో అమ్ముకోవచ్చని రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా ధృవీకరణ టెస్టులు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల అభివృద్ధి పనుల్లో పురోగతి పై ఆయన సమీక్షించారు. జిల్లా ఆసుపత్రి, వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతిలో ఉన్న పలు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు, ఆక్సిజన్ జనరేషన్ ట్యాంకు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని సంబంధిత ఆసుపత్రి పర్యవేక్షకులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. గత నెలలో రెండు ఆసుపత్రుల్లో నిర్వహించిన కరోనా ధృవీకరణ పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్లలోని జిల్లా ఆసుపత్రిలో 3 వేల 14 ర్యాపిడ్ పరీక్షలు, 111 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడం జరిగిందని, వేములవాడ లోని ప్రాంతీయ ఆసుపత్రిలో 869 ర్యాపిడ్ పరీక్షలు, 329 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు. రెండవ డోస్ వ్యాక్సినేషన్ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. లక్ష్యంలో వెనుకబడ్డ సబ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు.
సమావేశ అనంతరం యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగుపై రూపొందించిన గోడప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో డీఏఓ రణధీర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, డా.మహేష్ రావు, డిఐఓ డా. మహేష్, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post