ప్రత్యామ్నాయ పంటల తోనే రైతులకు మేలు
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
గుండ్ల పల్లె, నుస్తులాపూర్ లో ప్రత్యామ్నాయ పంటలు పరిశీలించిన కలెక్టర్
0000000
యాసంగి లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే రైతులకు మేలు చేకూరుతుందని ఆర్ వి కర్ణన్ అన్నారు. ఆదివారం గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, తిమ్మాపూర్ మండలం లోని నుస్తులాపూర్ గ్రామాల్లో రైతులు వేసిన వేరుశనగ ఇతర ఆరుతడి పంటలను కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. యాసంగి లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సి ఐ ద్వారా వడ్లు కొనుగోలు చేయదని తెలిపారు. యాసంగి లో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయదని అన్నారు. మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు మాత్రమే వరి పంట వేసుకోవాలని సూచించారు. ఒప్పందం చేసుకోని రైతులు వరి పంట వేసుకుంటే ధాన్యాన్ని సొంతంగానే అమ్ముకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గుండ్లపల్లి లో కొందరు రైతులు వేరుశెనగ, జొన్న పంట వేయగా వాటిని పరిశీలించి రైతులకు సూచనలు అందజేశారు. అలాగే తిమ్మాపూర్ మండలం లోని నుస్తులాపూర్ గ్రామంలో రైతులు వేసిన వేరుశనగ పంటలను కలెక్టర్ పరిశీలించారు. వరికి బదులు మినుములు కందులు, జొన్నలు, నువ్వులు తదితర లాభసాటి పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి సరిపడా విత్తనాలను రైతులకు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. పంట మార్పిడి కి తగిన సూచనలు సలహాలు కూడా రైతులకు అందిస్తామని కలెక్టర్ అన్నారు. వేరుశనగ తదితర పంటల కోత సమయములో కూలీలు దొరకడం లేదని రైతులు కలెక్టర్ కు తెలిపారు. కూలీల కొరత లేకుండా ప్రత్యామ్నాయ పంటల సమయములో ఉపాధి హామీ పనులను నిలిపివేస్తామని, రైతులకు కూలీలు అందుబాటులో ఉండేలా చూస్తామని కలెక్టర్ రైతులకు తెలిపారు. ఖరీఫ్ లో రైతులు వరి పంటలు వేసుకొని, యాసంగి లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటేనే రైతులకు దిగుబడి ఎక్కువ వస్తుందని కలెక్టర్ అన్నారు. పంట మార్పిడి వల్ల భూమి సారవంతం అవుతుందని తెలిపారు.