ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా రైతులకు లాభాలు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలో యాసంగి సమయంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లాలోని చెన్నూర్‌ మండలం కిష్టంపేట గ్రామం, కోటపల్లి మండలం కొండంపేట గ్రామం, వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామాలలో రైతులకు పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వరిధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో యాసంగిలో రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి, వాణిజ్య పంటలు సాగు చేయడంపై దృష్టి సారించాలని తెలిపారు. ఆరుతడి పంటలు, నూనె గింజలు, పప్పు దినుసులు లాంటి ప్రత్యామ్నాయ పంటలు చేసే విధంగా వ్యవసాయ, విస్తరణాధికారులు రైతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తప్పనిసరిగా వరి సాగు చేసే రైతులు సంబంధిత రైస్‌మిల్లర్లు, విత్తన సంస్థలతో ముందుగా ఒప్పందం చేసుకోవాలని సూచించారు. రైతులు ఏ మాత్రం నష్టపోకుండా ఆయిల్‌ఫామ్‌, కూరగాయలు తదితర పంటల సాగు చేయాలని, పంట మార్పిడి చేయడం ద్వారా భూసారం పెంపొందుతుందని, భవిష్యత్తులో పంటల దిగుబడి అధికమయ్యే అవకాశం ఉంటుందని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post