ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం
ఈనెల 6, 7, 27, 28 తేదీల్లో
ఈ ఆర్ వో, ఆర్ డి వో ఆనంద్ కుమార్
ఆర్ డి ఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్
0000
1వ జనవరి 2022 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను అందరిని ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేయుటకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఆర్డిఓ ఆనంద్ కుమార్ తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అంగన్వాడి టీచర్లు, రిసోర్స్ పర్సన్ లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఓటర్ జాబితా తయారు చేయుట కోసం ఈ నెలలో తేది.06-11-2021, 07-11-2021, 27-11-2021, 28-11-2021 శని, ఆదివారాల లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం బూత్ లెవల్ అధికారులు (బి.ఎల్.ఓ)ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, రిసోర్స్ పర్సన్లు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని సూచించారు. అలాగే డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని అన్నారు. శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరిచేసుకోవాలని సూచించారు.అందరు బి.ఎల్.ఓలకు ఓటర్ల నమోదుకు సంబంధించి ఫారం-6, ఫారం-7, ఫారం-8, ఫారం-8 A మొదలగు అన్ని రకాల ఫారంలు వారి దగ్గర అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కరీంనగర్ ఆర్డీవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఓటర్ నమోదు, మార్పులు చేర్పులపై ఏమైనా సందేహాలుంటే హెల్ప్ డెస్క్ లో సంప్రదించాలని సూచించారు. క్లెయిమ్స్ సమర్పించుట కు ఈనెల 30 చివరి తేదీ అని తెలిపారు. ఈ నెల 6, 7 తేదీల్లో పోలింగ్ కేంద్రాలను రోల్ అబ్జర్వర్, కలెక్టర్ తదితర ఎన్నికల అధికారులు సందర్శించటంతో పాటు జాబితాలను పరిశీలిస్తారని, అంగన్వాడి టీచర్లు, రిసోర్స్ పర్సన్లు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాల్లో ఉండాలని ఆర్డిఓ తెలిపారు.