ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను, తొలగించాల్సిన పేర్లను పరిశీలించి వేగవంతంగా సవరణ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

బుధవారం నాడు  ఓటరు నమోదు కార్యక్రమం గరుడ యాప్ వినియోగంపై ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం- 6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయడాన్ని  కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని,  లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని, డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని, శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం- 8 ద్వారా సరి చేయాలని సూచించారు.  ఓటర్లకు తమ పోలీస్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ రూపొందించిందని, దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని, గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, ఈవీఎం గోదాములను ప్రతి నెల తనిఖీ చేయాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ఆర్.డీ.ఓ. భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Share This Post