ప్రత్యేక బృందాలు వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా పని చేయాలి: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 27: ప్రత్యేక బృందాలు వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జనగామ పట్టణ వార్డు ప్రత్యేక అధికారులు, మున్సిపల్ సిబ్బంది తో జిల్లా కలెక్టర్ వ్యాక్సినేషన్ పై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లా, పట్టణ, వార్డు, గ్రామ స్థాయిలో వ్యాక్సినేషన్ క్షేత్ర స్థాయిలో పూర్తికి మల్టీ డిసిప్లినరీ బృందాలు ఏర్పాటు చేసినట్లు, ఈ బృందాలు నేటి నుండే విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ బృందంలో మండల స్థాయిలో ప్రత్యేక అధికారి, తహసిల్దార్, ఎంపిడీఓ, మండల వైద్యాధికారి, నోడల్ అధికారులుగా గ్రామ స్థాయిలో ఆశా వర్కర్, అంగన్ వాడి కార్యకర్త, పంచాయతీ కార్యదర్శి, విఆర్ఏ, రేషన్ షాప్ డీలర్ మరియు జీపి నోడల్ అధికారిగా ఉండాలన్నారు. జిల్లాలో బుధవారం వరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల వారిగా మొదటి డోసు, రెండవ డోసు కలిపి 1 లక్షా 10 వేల కరోనా వ్యాక్సిన్ డోసులు వేయుటకు అర్హులు ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. జిల్లా, పట్టణంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ తీసుకున్నవారు, తీసుకోనని వారు, మొదటి డోసు, రెండవ డోసు తదితర విషయాలు పేర్లతో సహా నమోదు చేసుకొని, కేటాయించిన లక్ష్యం నవంబర్ 3 లోపు పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో రైస్ మిల్లులు, సినిమా హాళ్ళు, వాణిజ్య వ్యాపార సంస్థలు, హోటళ్ళలో పనిచేసే ఏ ప్రాంతానికి చెందిన వారైన వ్యాక్సిన్ తీసుకోని యెడల వారిలో ఏ ఒక్కరిని వదలకుండా సర్వే చేసి పక్కాగా వ్యాక్సిన్ వేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో మల్టీ డిసిప్లినరీ బృందంతో పాటు స్వచ్చంధ సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని వంద శాతం వ్యాక్సిన్ పూర్తి చేసి జనగామ జిల్లాను కరోనా రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సమిష్టి కృషి, పట్టుదలతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారిణి డా. కరుణశ్రీ, మునిసిపల్ కమిషనర్ నర్సింహ, జిల్లా అధికారులు, వార్డు ప్రత్యేక అధికారులు, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారి చేయనైనది.

Share This Post