జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు ఇతోధికంగా మేలు చేకూరాలనే ఉద్దేశ్యంతో అన్ని వసతులతో కూడిన ఉచిత కోచింగును అందిస్తున్నామని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి అదనంగా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా అభ్యర్థుల ఉపయోగార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల సన్నద్ధతకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉద్యోగం సాధించాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియలో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో రూపొందించిన ఆన్లైన్ వీడియో క్లాసుల యాప్ ను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి,సి.పి నాగరాజు తో కలిసి మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
గూగుల్ ప్లే స్టోర్ లో Balkonda E Class Room పేరుతో యాప్ అందుబాటులో ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ, ఈ యాప్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తెలుగు మాధ్యమం ఆన్లైన్ క్లాసులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆంగ్ల మాధ్యమం ఆన్లైన్ క్లాసులు వినియోగించుకోవచ్చని సూచించారు. పోలీస్ శాఖలోని ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతో పాటు అన్ని గ్రూప్ ఎగ్జామ్స్, ఇతర పోటీ పరీక్షల ప్రిపరేషన్ కు, పునఃశ్చరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే 57 రకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ యాప్ ద్వారా అన్ని విద్యాలుగా సన్నద్ధం కావచ్చని సూచించారు. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో 87 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న క్రమంలో జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు దక్కాలనే తపనతో ఖర్చుకు వెనుకాడకుండా ప్రీ కోచింగ్, మెటీరియల్ అందించడంతో పాటు ప్రత్యేకంగా యాప్ ను రూపొందింపజేశానని అన్నారు. ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని జిల్లాకు చెందిన యువతీ యువకులు అత్యధిక ఉద్యోగాలు సాధిస్తే తనకు అంతకంటే ఆనందం మరేమీ ఉండదని అన్నారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, ప్రస్తుతం రెండు నెలలు గట్టిగా కష్టపడి చదివితే, రాబోయే 40 సంవత్సరాల జీవితాన్ని ఉద్యోగ భద్రతతో హాయిగా గడపవచ్చని సూచించారు. ఇదివరకు స్థానికేతరులకు కూడా ఉద్యోగాల్లో వాటాను అమలు చేయడం వల్ల తెలంగాణా కొలువులను ఆంధ్రా ప్రాంతం వారే కైవసం చూసుకునేవారని అన్నారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసి స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా జీ ఓ జారీ చేయించారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకోవడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. అంతేకాకుండా ఎలాంటి అనుమానాలు, అక్రమాలకు తావులేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఇంటర్వ్యూ విధానాన్ని కూడా ఎత్తివేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చక్కగా కష్టపడి చదువుకుని ప్రతి ఒక్కరు ప్రభుత్వ కొలువు సాధించాలని మంత్రి వేముల ఆకాంక్షించారు. అనేక అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని అలుపెరుగని పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణాలో అన్ని వర్గాల వారి అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. నాడు తెలంగాణలో కారు చీకట్లు కమ్ముకుంటాయని చెప్పిన వారే నేడు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ వెలుగులు విరాజింపజేస్తోందని అన్నారు.
కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన మీదట తెలంగాణాలో అన్ని రంగాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, మారుమూల పల్లెల్లోనూ మౌలిక సదుపాయాలకు సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రజలకు పాలనా యంత్రాంగం మరింత చేరువయ్యిందని, తెలంగాణ ప్రగతిలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం ఎంతగానో పెరిగిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కాలనే సంకల్పంతో ప్రభుత్వం స్థానికత జీవో అమలు చేస్తోందని, ఫలితంగా ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే రెండు వేల ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని తెలిపారు. ఈ సదవకాశాన్ని యువత వినియోగించుకుని ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ధృడ సంకల్పంతో కష్టపడి చదివితే తప్పక లక్ష్యాన్ని సాధించగల్గుతారని అన్నారు.
అంతకు ముందు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉద్యోగార్థులకు ఉపయుక్తంగా నిలిచే పోటీ పరీక్షల మెటీరియల్స్ బుక్కులను వితరణ చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, నగర మేయర్ నీతూ కిరణ్, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు, రెడ్ కో చైర్మన్ అలీం, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
————————–