భద్రత కోసమే ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ల నిర్మాణం: :రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్

ప్రధాన భూమికను పోషించే ఈవీఎంల భద్రత కోసమే ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ల నిర్మాణం: :రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్

*ప్రచురణార్థం-1*
జనగామ, డిసెంబర్ 12: ఎన్నికల ప్రక్రియలో ప్రధాన భూమికను పోషించే ఈవీఎంల భద్రత కోసమే ఎలక్షన్ ఈవీఎం గోడౌన్లను నిర్మించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం సిఇఓ జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల ఆవరణలో నూతనంగా నిర్మించిన ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు హృదయం లాంటివని అన్ని జిల్లాల్లో ఎలక్షన్ ఈవీఎంలను భద్రపరిచేందుకు ప్రత్యేక గోడౌన్ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన అన్ని జిల్లాలలో ఈవీఎం గోడౌన్ ల నిర్మాణం చేపట్టామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 గోడౌన్ల నిర్మాణం చేపట్టగా, ఇప్పటి వరకు 20 పూర్తయ్యాయని, నారాయణపూర్, కామారెడ్డి జిల్లాలలో నిర్మాణాలు ప్రగతిలో ఉన్నాయని అన్నారు. ఈ నెలాఖరులోగా వాటిని కూడా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. పోలీస్ బందోబస్తుతో ఈవీఎంలను ఈ గోడౌన్లలో భద్రపరిచి భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఉపయోగించనున్నట్లు ఆయన అన్నారు. స్పెషల్ సమ్మర్ రివిజన్ లో భాగంగా 1 జనవరి, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సిఇఓ కోరారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు తదితర వివరాలు, చనిపోయిన వారి తొలగింపులతో, జనవరి 5 వరకు తుది జాబితా సిద్దం అవుతుందన్నారు. ఇతర ప్రాంతాల నుండి జనగామకు వలస వచ్చిన వారు ఫారం-6 లో దరఖాస్తు చేసుకుంటే పాత జాబితా నుండి తీసివేసీ ఇక్కడ నమోదు చేస్తామన్నారు. జిల్లాకు విచ్చేసిన సిఈఓకు జిల్లా కలెక్టర్ శాలువాతో సన్మానించి, మెమెంటో అందజేశారు. అనంతరం గోడౌన్ ప్రాంగణంలో సిఇఓ, జిల్లా కలెక్టర్లు మొక్క నాటి నీళ్ళు పోసారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, ఆర్డిఓలు సిహెచ్. మధుమోహన్, కృష్ణవేణి, ఎస్డిసి మాలతీ, డిఆర్డిఓ జి. రాంరెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ సిహెచ్. హుస్సేన్, డిఈ అశోక్ కుమార్, స్థానిక తహశీల్దార్ రవీందర్, కలెక్టరేట్ ఏవో మురళీధర్ రావు, పర్యవేక్షకులు సలీం, ఏతేషామ్ అలీ, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post