ప్రభుత్వం నుండి ప్రత్యక్షంగా, పరోక్షంగా రాయితీలు పొందుతున్న సంస్థలు సమాచారహక్కు చట్ట పరిధిలోకి వస్తాయని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్నాయక్ తెలిపారు.

బుధవారం సింగరేణి మహిళా కళాశాలలో విద్యాశాఖ ఆద్వర్యంలో యంఈఓలకు, ప్రధానోపాధ్యాయులకు, కెజిబివి ప్రత్యేక అధికారులకు సమాచారహక్కు చట్టం అమలుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ అన్ని కార్యాలయాల్లో 17 అంశాలతో కూడిన సమాచార చట్టం సమాచారాన్ని స్వచ్చందంగా వెల్లడించాల్సి ఉంటుందని చెప్పారు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరిన వ్యక్తులకు 30 రోజుల్లో సమాచారం అందచేయాలని చెప్పారు. 30 రోజుల్లోగా అందచేయకపోతే అప్పిలేట్ అధికారికి దరఖాస్తు చేయాలని, అప్పిలేట్ అధికారి 15 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే కమిషన్ నోటీసులు జారీ చేస్తుందని చెప్పారు. సకాలంలో సమాచారం ఇవ్వకపోతే కమిషన్ జరిమాన విధిస్తుందని, చట్టాన్ని పరిగణలోకి తీసుకుని నిర్దేశిత సమయంలోగా సమాచారం ఇవ్వాలని చెప్పారు. కమిషన్ నిర్వహించే విచారణలో వాస్తవాలు గుర్తిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆయన వివరించారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇవ్వకుండా ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని ఆయన సూచించారు. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనదని, విద్యార్థులకు, ప్రజలకు చట్టం పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు. సామాన్యులకు బ్రహ్మ అస్త్రం, వజ్రాయుధం సమాచార హక్కుచట్టమని దీనిని క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను ఉపాద్యాయులు తీసుకోవాలని ఆయన చెప్పారు. చట్టంపై అవగాహన కొరకు ప్రతి పాఠశాలలో 5 (1) (2) ప్రకారం బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు రిజిష్టరు నిర్వహించాలని చెప్పారు. చట్ట ప్రకారం కోరిన సమాచారం ఇస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని, కావాలని కాలయాపన చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయని ఆయన చెప్పారు. కమిషన్కు వచ్చిన పిర్యాదులను కమిషన్ విచారణ నిర్వహించి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్య ధోరణి విడనాడాలని, పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వాలని, మొండివైఖరి మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. ఇతర కార్యాలయాలకు సంబంధించిన సమాచారం అడిగినపుడు ఐదు రోజుల్లో సంబంధిత కార్యాలయానికి సిఫారసు చేసి దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వాలని చెప్పారు. ప్రజలకు సమాచారం పొందే హక్కు కల్పించిన ఈ చట్టం చాలా గొప్పదని, ప్రాధాన్యతను గుర్తించి సకాంలో సమాచారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సమాచారం అడినపుడు రికార్డులు లేవని చెప్పడానికి వీల్లేదని నిర్ధారణ పత్రాలను దరకాస్తుదారునికి ఇవ్వాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అనంతరం చట్టంపై ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సమాధానాలు ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ, వ్యవసాయశాఖ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శారద, తహసిల్దార్ రామక్రిష్ణ, ప్రధానోపాద్యాయుల సంఘ అధ్యక్షులు మాధవరావు అన్ని మండలాల యంఈఓలు, పాఠశాలల ప్రధానోపాద్యాలు, కెజిబివి ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post