పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్టు 7:–
ప్రభుత్వం నేతన్నలకు అన్ని విధాలా చేయూతనిస్తున్నదని, ముడిసరకు మొదలుకొని ఉత్పత్తుల వరకు వివిధ రాయితీలు ఇస్తూ , సహాయ సహకారాలు అందిస్తుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని ఐటిఐ కళాశాల గ్రౌండ్స్ నుండి కలెక్టరేట్ వరకు చేనేత సహకార సంఘాల ప్రతినిధులు నేత కార్మికుల తో నిర్వహించిన హ్యాండ్లూమ్ వాక్ ను పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ హనుమంతరావు జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చేనేత రంగాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం ప్రతి మగ్గాన్ని జియో ట్యాగింగ్ చేసిందన్నారు. చేనేత కార్మికులు ఇతర రంగాలకు వెళ్లకుండా చేనేతకు పూర్వవైభవం తెచ్చేలా ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. జిల్లాలోని చేనేత సహకార సంఘాలు తమ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా కలెక్టరేట్లో ప్రతి సోమవారం స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తామని తెలిపారు.
జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావ్ మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికులకు ముడిసరకు మొదలు మార్కెటింగ్ వరకు అవసరమైన సదుపాయాలు సమకూరుస్తునదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మన దగ్గర తయారయ్యే వస్తువులు కొనేలా చొరవ చూపాలన్నారు. నేతన్నకు చేయూతనిచ్చేలా ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు.
అదనపు కలెక్టర్ వీరా రెడ్డి మాట్లాడుతూ చేనేత కళ అంతరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పరిశ్రమ అభివృద్ధికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయన్నారు. చేనేత రంగంలో టెక్నాలజీ పెంపొందిందని, చేనేత కార్మికులు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. మన రాష్ట్రంలో తయారవుతున్న వస్త్రాలు ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయని గుర్తు చేశారు. ప్రజలు చేనేత వస్త్రాలు ధరించేలా ప్రోత్సహించాలన్నారు.
చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు విజయలక్ష్మి ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న పలు పథకాల గురించి వివరించారు. జిల్లాలో ప్రస్తుతం 74 మంది చేనేత కార్మికులు, 31 మంది అనుబంధ కార్మికులు వివిధ చేనేత సహకార సంఘాలలో పనిచేస్తున్నారని ఆమె తెలిపారు.
అనంతరం జోగిపేట, నారాయణఖేడ్ ,హనుమంతరావు పేట చేనేత సహకార సంఘాల కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు ,కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.