ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు,

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులకు  సూచించారు.

జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పీలు, సంబంధిత అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీష్ రావు, సీ.ఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ సమీక్ష నిర్వహిస్తూ పలు సూచనలు చేశారు.

ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మధ్యాన్నం ఒంటి గంటకు కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆ మరుసటి రోజైన 19వ తేదీన మిగతా అన్ని జిల్లాలలో ఉదయం 9.00 గంటలకు కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎక్కడికక్కడ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి నిర్దేశిత ప్రాంతాల్లో శిబిరాలు ప్రారంభించాలని కలెక్టర్లకు సూచించారు. శిబిరాల వద్ద తోపులాటలు, గలాటాలు, గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ యంత్రాంగాన్ని కోరారు. ప్రతి శిబిరం వద్ద తగు సంఖ్యలో పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. శిబిరాల వద్ద ఒకేసారి ప్రజలు గుమిగూడకుండా ప్రణాళికాబద్ధంగా, క్రమపద్దతిలో కంటి పరీక్షలు నిర్వహించుకునేలా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతీరోజు కనీసం 120 నుండి 130 మందికి నేత్ర పరీక్షలు చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు విధిగా శిబిరాలు కొనసాగాలని, వైద్య బృందాలు ఉదయం 8.45 గంటలకు, ఏ.ఎన్.ఎం లు, ఆశా కార్యకర్తలు ఉదయం 8.00 గంటలకే శిబిరాల వద్దకు చేరుకోవాలని ఆదేశించారు.

ప్రపంచంలోనే మరెక్కడాలేని విధంగా పెద్ద ఎత్తున చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని హితవు పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ, మొదటి విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విధంగా, అదే తరహా స్పూర్తితో ప్రస్తుతం కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు చొరవ చూపాలన్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా శిబిరాల్లో నాణ్యతతో కూడిన సేవలందించాలని, అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలను అప్పటికప్పుడే అందించాలన్నారు. శిబిరాల నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాలకు నిధులు కేటాయించడం జరిగిందని, ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని సూచించారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో జనవరి 19వ తేదీన ఉదయం 9.00 గంటలకు మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ నందు రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలో 558 గ్రామ పంచాయతీలు, 23 జి.హెచ్.ఎం.సి వార్డులు యుఎల్.బి.సి.లు 358  మొత్తం 965 హాబిటేషన్ లలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికై 80 బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అదనంగా 4 బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాకు ఇప్పటికే 1,04,409 కళ్లద్దాలు వచ్చాయని  కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, పిడి డిఆర్డిఎ ప్రభాకర్, ఆర్డీఓలు వెంకటాచారి, రాజేశ్వరి, చంద్రకళ, వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Share This Post