ప్రభుత్వం సిఫార్సు చేసిన రుణాలను బ్యాంకులు త్వరగా మంజూరు చేయాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య…

పత్రిక ప్రకటన

తేదీ : 17–11–2022

ప్రభుత్వం సిఫార్సు చేసిన రుణాలను బ్యాంకులు త్వరగా మంజూరు చేయాలి,

బ్యాంకులు అర్హులైన వారికి రుణాలు సకాలంలో అందించాలి,

నగదు రహిత ఖాతాలను జిల్లాలోని బ్యాంకులు ప్రోత్సహించాలి,

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య,

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సిఫార్సు చేసిన లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని ఈ విషయంలో వారి పట్ల ప్రత్యేక  శ్రద్ధ కనబర్చాలని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య  అన్నారు. గురువారం శామీర్పేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన వారికి రుణాలను బ్యాంకర్లు త్వరితగతిన మంజూరు చేయాలని ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే బ్యాంకర్ల ఆ సమస్యలను సంబంధిత జిల్లా అధికారికి తెలియజేయడంతో పాటు వాటిని పరిష్కరించి రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సమావేశంలో సూచించారు.  దీంతో పాటు బ్యాంకర్లు మంజూరు చేసిన రుణాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లా అధికారికి సమాచారం అందేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని అదనపు కలెక్టర్  వివరించారు.  మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకులు సకాలంలో రుణాలు అందించి వారిని ఆర్థికంగా అభివృద్ది చెందేలా సహకరించాలని అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించి వారి ఆర్థికాభ్యున్నతికి తోడ్పాటునందించాలనే సంకల్పంతో ఉందని దీనికి సహకరించాల్సిన బాధ్యత జిల్లాలోని అన్ని బ్యాంకులపై ఉందని ఈ విషయంలో లీడ్ బ్యాంకు వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.  దీంతో పాటు నగదురహిత ఖాతాలు (డిజిటల్ పేమెంట్స్)కు సంబంధించి జిల్లాలోని అన్ని సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలి అని తెలిపినారు  ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా వెనుకబడిన, షెడ్యూల్ కులాల  తరగతులు,  జిల్లా పరిశ్రమల శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించి బ్యాంకులు నిధులు విడుదల చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో  తమకు సహకరించాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.  ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కిశోర్ కుమార్,ఆర్బీఐ రాజేంద్రప్రసాద్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్.డి.ఓ రాజేంద్రప్రసాద్  జడ్పీ సీఈవో దేవసహాయం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి పద్మజారాణి, జిల్లా షెడ్యూల్ కులాల అధికారి బాలాజీ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిణి ఝాన్సీరాణి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రవీందర్, జిల్లా వ్యవసాయాధికారిణి మేరీరేఖ, కెనెరా బ్యాంక్, సిండికేట్ బ్యాంకుల అధికారులతో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు, జిల్లాలోని బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post