ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం తో పాటు మౌళిక సదుపాయాలు కల్పించాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి మొహమ్మద్ ఉమర్ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ న్యాయ సేవా సాధికారత కమిటీ ఆదేశానుసారం జిల్లాలో నవంబర్ 26 నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు తాలూకా న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు, విద్యార్థులకు చట్టాల పై అవగాహన కల్పించేందుకు ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వారి హక్కులు వారికి ఉంటాయని తెలిపారు. నాణ్యమైన వైద్యం తో పాటు మౌళిక వసతులు ఉండాలని తెలిపారు. ఆసుపత్రి పరిసర ప్రాంతం పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆసుపత్రి సూపరిండెంట్ ను సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ రంజిత్ కుమార్, డాక్టర్లు, తదితరులు హాజరయ్యారు.