ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ఆచ్ఛంపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ రోగులకు సౌకర్యాలపై అసంతృప్తి.

మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ అచ్ఛంపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఆసుపత్రిలో ఎక్కడ చూసిన అపరిశుభ్రత, మరుగుదొడ్ల  దుర్వాసనతో ఉండటంతో ఆసుపత్రి సూపరిండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  డాక్టర్ల పేర్లు వారి ఫోన్ నెంబర్లు, డ్యూటీ డాక్టర్ల పేర్ల సూచిక బోర్డు పెట్టమని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పటికిని ఇక్కడ ఎందుకు పెట్టలేదని సూపరిండెంట్ ను ప్రశ్నించారు.  గైనకలజిస్ట్, డ్యూటీ డాక్టర్ల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.   ఆపరేషన్ థియేటర్ ను పరిశీలించిన కలెక్టర్ థియేటర్ కు తాళం వేసి ఉండటం  పై విస్మయం వ్యక్తం చేశారు.  వారంలో ఎన్ని రోజులు ఏ రకమైన సర్జరీలు చేస్తున్నారని సూపరిండెంట్ ను ప్రశ్నించగా  వారంలో రెండు రోజులు సి.సేక్షన్ కేసులు చేస్తున్నామని జవాబిచ్చారు.  ఆసుపత్రిలో పూర్తి స్థాయి డాక్టర్లు, అనస్థీషియా మౌళిక సదుపాయాలు ఉన్నప్పటికిని వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే శస్త్ర చికిత్సలు నిర్వహించి మిగతా రోజుల్లో వచ్చే అత్యవసర కేసులను నాగర్ కర్నూల్ కు పంపించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల వార్డు, లేబర్ వార్డు, ఓ.పి వార్డులను కలెక్టర్ పరిశీలించారు.  మరుగుదొడ్ల మరమ్మతులకు ఎంత నిధులు అవసరం అవుతాయో అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు.

ఆర్డీఓ పాండు నాయక్, ఆసుపత్రి సూపరిండెంట్ కృష్ణ ఆసుపత్రి సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.

Share This Post