ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెలి కన్సల్టేషన్ వైద్య సేవలు ప్రజలకు చాలా ఉపయోగమని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

మంగళవారం ఇల్లందు మండంలంలోని రొంపేడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు కొరకు వచ్చిన ప్రజలను వ్యాధి తీవ్రత, చికిత్సలు అందిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. వివిధ రకాల వ్యాధులతో భాదపడుతున్న ప్రజలకు ప్రత్యేక వైద్యులతో టెలి కన్సల్టేషన్ వైద్య సేవలు అందించేందుకు మంజూరు చేసిన దీవిని వినియోగించకుండా స్టోర్ రూములో పెట్టినట్లు గమనించిన కలెక్టర్ ఉప వైద్యాధికారి డాక్టర్ వినోద్కు ఫోన్ చేసి టివి మంజూరు చేసింది స్టోర్ రూములో పెట్టడానికి కాదని, తక్షణం ఏర్పాటు చేయించి తనకు నివేదికలు అందచేయాలని ఆదేశించారు. టెలికన్సల్టేషన్ సేవలు అందించుటకు అంతర్జాల సేవల్లో అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. ఆసుపత్రిలో టెలి కన్సల్టేషన్ సేవలును ఆన్లైన్లో పరిశీలించారు. మన దగ్గర అందుబాటులోని వైద్య సేవలను ప్రత్యేక వైద్యుల ద్వారా టెలి కన్సల్టేషన్ ద్వారా సేవలు అందించాలని చెప్పారు. సెప్టెంబర్ 16వ తేదీ నుండి ప్రారంభమైన ప్రత్యేక వ్యాక్సిన్ కార్యక్రమ నమోదు వివరాల రిజిష్టరును పరిశీలించారు. అంతకు ముందు విజయలక్ష్మి గ్రామ పంచాయతీ పరిధిలోని సింగరేణి క్వార్టర్స్ లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఇంటింటి సర్వే నిర్వహించాలని, వ్యాక్సిన్ పూర్తయిన గృహాలకు గుర్తులు వేయాలని చెప్పారు. మండలంలో మొత్తం 29 గ్రామ పంచాయతీలుండగా ఇప్పటి వరకు 8 గ్రామ పంచాయతీల్లో నూరు శాతం వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయిందని, రానున్న రెండు రోజుల్లో మండలం మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసి నూరు శాతం వ్యాక్సిన్ జరిగిన మండలంగా ప్రకటించుటకు చర్యలు తీసుకోవాలని తహసిల్దారు, యంపిడిఓ, వైద్యాధికారిని ఆదేశించారు. మెడిసిన్ సేవలు గురించి వైద్యులను అడిగి తెలుసుకుని ఇప్పటి వరకు టెలి కన్సల్టేషన్ వైద్య సేవలు అందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయుటకు గ్రామ పంచాయతీల సర్పంచుల సహాకారం తీసుకోవాలని చెప్పారు. కరోనా నియంత్రణకు అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రజలు సహాకరించి తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులను కోవిన్ పోర్టల్ నందు అప్లోడ్ చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మంచిగా నిర్వహిస్తున్నారని సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో నూరు శాతం వ్యాక్సిన్ పూర్తి చేయాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించుటకు గ్రామాల్లో టాం టాం వేయించడం, మైకుల ద్వారా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. అనంతరం రొంపేడు బృహత్ పకృతి వనాన్ని తనిఖీ చేశారు. మొక్కల సంరక్షణకు తక్షణమే బోర్ ఏర్పాటుతో పాటు డ్రిప్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని చెప్పారు. మొక్కలు వంగిపోకుండా సక్రమంగా ఏపుగా పెరిగేందుకు సపోర్టుగా కర్రలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పార్కు మద్యలో నీరు నిలుస్తున్న ప్రాంతంలో చిన్న నీటి గుంట ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసిన పకృతివనంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని చెప్పారు. పకృతివనంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధిహామి పథకం, గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ సిబ్బందితో కలిసి ఫోటో దిగారు. మొక్కల సంరక్షణ మీ బాద్యతేనని వారికి అవగాహన కల్పించారు. సిబ్బంది వేతనాలు చెల్లింపులో జాప్యం చేయొద్దని సూచించారు. బృహత్ పకృతి వనం ఏర్పాటు చేయడం పట్ల సర్పంచు, యంపిడిఓ, యంపిటను, తహసిల్దార్ను అభినందించారు. ఈ కార్యక్రమాల్లో తహసిల్దార్ క్రిష్ణవేణి, యంపిడిఓ అప్పారావు, యంపిఓ అరుణ్ గౌడ్, వైద్యాధికారి డాక్టర్ సురేష్, సర్పంచ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post