ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలి జిల్లా అధికారులు సమన్వయము తో కరోనా టీకాలు అందరికీ అందేలా చూడాలి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలి

జిల్లా అధికారులు సమన్వయము తో కరోనా టీకాలు అందరికీ అందేలా చూడాలి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారిలో విశ్వసనీయత కలిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు మొదలుకొని కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వైద్య,  ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

శనివారం హైదరాబాద్​లోని బీఆర్​కేఆర్​ భవనం నుంచి జిల్లా కలెక్టర్లు, వైద్య,  ఆరోగ్య శాఖ ఆయా శాఖల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ వైద్యశాలలు మొదలుకొని జిల్లా ఆసుపత్రుల వరకు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులంటే వారిలో విశ్వసనీయతను కలిగించేలా కృషి చేయాలని సూచించారు.  ఈ విషయంలో రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.  అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల  వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ విషయంలో జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆస్పత్రుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు బాగుండాలనే కృతనిశ్చయంతో జిల్లా కలెక్టర్లు,  జిల్లా వైద్య,  ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేసి  తగిన సలహాలు, సూచనలు అందజేయాలని అప్పుడే ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై పూర్తి విశ్వసనీయత కలుగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. దీంతో పాటు  ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి ? సిబ్బంది పనితీరుతో పాటు వసతులు ఎలా ఉన్నాయి ? అనే తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి తెలిపారు.  అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత పాటించడం ఎంతో ముఖ్యమైన విషయమని ఈ విషయంలో ఆయా ఆసుపత్రుల అధికారులు,  సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.  అలాగే రాబోయే రోజుల్లో తాను కూడా రాష్ట్రంలోని ఆయా ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ఆయా ఆసుపత్రుల్లో వసతులు,  సౌకర్యాలు, సిబ్బంది, మందులతో  పాటు ప్రజలకు అందుతున్న వైద్యసేవలు గురించి తెలుసుకుంటానని మంత్రి హరీష్ రావు వివరించారు.  దీంతో పాటు ఆయా జిల్లాల ఆస్పత్రులకు ఆక్సిజన్ ప్లాంట్లను కేటాయించడం జరిగిందని ప్రస్తుతం వాటి పనితీరు ఎలా ఉంది ?  అనే విషయాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు నిధుల కొరత ఏమాత్రం లేదని ఈ విషయంలో ప్రజలకు అన్ని రకాలుగా మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని తెలిపారు.  దీంతో పాటు ఆయా ఆస్పత్రుల్లో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి సమస్య పరిష్కరించేందుకు తాము స్వయంగా కృషి చేస్తానని మంత్రి హరీష్ రావు వివరించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 70 శాతం,  నాన్ జీహెచ్ఎంసీ పరిధిలో 107 శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. అలాగే వ్యాక్సినేషన్​ పూర్తికాని చోటా అందరికీ వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తున్నామని కలెక్టర్​ మంత్రికి వివరించారు.  ఈ విషయమై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ జీహెచ్​ఎంసీ వారితో జిల్లా వైద్య శాఖ అధికారులు సమన్వయం చేసుకొని పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  దీనికి కలెక్టర్​ హరీష్​ స్పందిస్తూ మంత్రి ఆదేశాల మేరకు జీహెచ్​ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో కరోనా టీకాలు వేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ మంత్రి హరీష్​రావుకు తెలిపారు. ఈ సమావేశంలో, డీఎం అండ్​ హెచ్​వో డాక్టర్​ మల్లికార్జున్​రావు,డి పి ఓ ,రమణమూర్తి  పాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post