ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలి:: వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్

ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలి:: వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్

జనగామ, ఆగస్టు 19: ప్రభుత్వ ఫలాలు అర్హులకు అందేలా ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా అమలుచేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటి (దిశ) సమావేశాన్ని ఎంపీ నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 12 మండలాలలోని 281 గ్రామాల్లో లక్షా 21 వేయి 463 కుటుంబాలకు జాబ్ కార్డులు జారీచేసారన్నారు. ఉపాధి హామీలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, రైతు వేదికలు, రైతు కల్లాలు, నర్సరీలు, మేక, గొర్రెల పాకలు, కోళ్ల పాకలు, ఆవు, గేదెల పాకల నిర్మాణాలు చేసినట్లు ఆయన అన్నారు. ఇప్పటివరకు 49 కోట్ల 62 లక్షల రూపాయలను ఉపాధి హామీ క్రింద ఖర్చు చేశామన్నారు. హరితహారం క్రింద ఈ సంవత్సరంలో 33 లక్షల 58 వేల మొక్కలు నాటే లక్ష్యానికి ఇప్పటి వరకు 24 లక్షల 46 వేల 342 మొక్కలు నాటినట్లు తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన క్రింద 96 కోట్ల 13 లక్షల అంచనాలతో మొదటి విడతగా 7, రెండో విడతలో 5 రహదారుల నిర్మాణం మంజూరుకాగా పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. పనులు త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. జాతీయ వైద్య మిషన్ క్రింద కేంద్రం నుండి వస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక వేయి 199 ప్రసవాలు జరిగినట్లు, ఒక వేయి 59 మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు గతంలో 30 శాతం ఉండగా, ఇప్పుడు 80 శాతానికి పెరిగినట్లు ఆయన అన్నారు. కోవిడ్ 3వ దశ వ్యాప్తి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ సూచించారు. జిల్లాలో కోవిడ్ టీకా మొదటి డోసు 99 వేల 604 మందికి, రెండో డోసు 42 వేల 946 మందికి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వచ్చే డిశంబర్ లోగా ప్రతి ఒక్కరికి టీకా అందించే దిశగా ప్రణాళిక చేసినట్లు ఎంపీ అన్నారు. జిల్లాలో లక్షా 62 వేల 870 ఆహార భద్రతా కార్డులు ఉన్నట్లు, జూన్ మాసంలో 15 కిలోలు, జూలై మాసంలో 5 కిలోలు, ఆగస్టు మాసంలో 15 కిలోల చొప్పున ఉచితంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పధకం క్రింద పంపిణీ చేశామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహారీగోడ, త్రాగునీరు, టాయిలెట్స్ తదితర మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలు పునః ప్రారంభం కానున్నందున కోవిడ్ నియంత్రణ చర్యలను పటిష్టంగా చేపట్టాలని, పిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని ఆయన తెలిపారు. విద్యుత్ శాఖచే లూజ్ వైర్ల సరిచేయడం, విరిగిన స్తంభాల స్థానంలో క్రొత్తవి, వంగిన స్తంభాలు సరిచేయడం చేయాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలన్నారు. ప్రతి గ్రామంలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లలో కంపోస్ట్ తయారీకి చర్యలు చేపట్టాలని, తడి పొడి చెత్తను వేరు వేరుగా అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. అధికారులు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి మాట్లాడుతూ, అధికారులు క్షేత్ర స్థాయిలో క్రియాశీలంగా పనిచేయాలన్నారు. హరితహారం క్రింద నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పాఠశాలలను శుభ్రపరచి, పునఃప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. నిఖిల మాట్లాడుతూ, ప్రభుత్వం ఆసరా పించనుల వయస్సు 57 సంవత్సరాలకు కుదించినందున అర్హులు దరఖాస్తుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. షెడ్యూల్ రూపొందించి, మీ సేవ ఆపరేటర్లు గ్రామ పంచాయితీల్లోనే దరఖాస్తులు స్వీకరించేలా చర్యలు చేపడతామన్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు మెరుగుపరచడానికి ప్రతిపాదనలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని, ప్రతి మండలంలో 5 పాఠశాలల్లో అన్ని పారామీటర్లలో మౌళిక సదుపాయాలకల్పనకు ప్రభుత్వం నుండి విధివిధానాల కొరకు ఎదురుచూస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల వేగానికి చర్యలు చేపట్టామన్నారు.
సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, పథకాలు అర్హులకు చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆసరా పింఛన్ల దరఖాస్తులు ఉచితంగా గ్రామ పంచాయతీల వద్దే తీసుకొనేలా చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ పై ముందస్తు చర్యలు తీసుకోవాలని, మాస్క్, సానీటైజర్, భౌతిక దూరం గురించి ప్రజల్లో చైతన్యం తేవాలని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై పర్యవేక్షణ చేయాలని, అదనపు వసతుల గురించి ప్రజాప్రతినిధులను సంప్రదించాలని అన్నారు.
సమావేశంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు వాడుకలో వచ్చాయన్నారు. రైతు కల్లాల నిర్మాణాలు లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చిన వారికి వెంటనే రైతు కల్లాల మంజూరు చేయాలన్నారు. నర్సరీలు రాబోయే తరానికి అందించే గొప్ప సంపద అని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ లలో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు, వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నష్ట నివారణ చేసుకోవాలన్నారు. ఆన్లైన్ క్లాసుల్లో అందరు విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, డిఆర్డీవో జి. రాంరెడ్డి, దిశ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post