ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలి పనులన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తయ్యేలా చూడాలి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఇంఛార్జి కలెక్టర్ హరీశ్

పత్రిక ప్రకటన తేదీ : 13–08–2021
=============================================

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ది, సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలయ్యేలా సంబంధిత జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనులు పూర్తయ్యేలా చూడాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఇంఛార్జి కలెక్టర్ హరీశ్ అన్నారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, జిల్లా ముఖ్య ప్రణాళిక (సీపీవో), జిల్లా పంచాయతీ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ది, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎంత మేరకు టీకాలు ఇచ్చారు ఇంకా ఎంత మందికి టీకాలు ఇవ్వాల్సి ఉందనే వివరాలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్రావును అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ టీకాలు అందచేస్తున్నామని అలాగే ఎప్పటికప్పుడు కరోనా వివరాలను తెలుసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయంలో సీజనల్ వ్యాధులు సోకకుండా కూడా తమ శాఖ అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఎన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్లు మంజూరయ్యాయి ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి ? ఇంకా ఎన్ని నిర్మాణాలు ఏఏ దశల్లో ఉన్నాయనే వివరాలను పంచాయతీరాజ్ ఈఈని అడిగి తెలుసుకొన్నారు. డబుల్బెడ్రూమ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే జిల్లాలోని గ్రామపంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమం కింద చేపట్టిన కార్యక్రమాలు, వాటి పురోగతి, ఇంకా ఏమైనా పనులు పెండింగ్లో ఉన్నాయా అనే వివరాలను జిల్లా పంచాయతీ అధికారిని అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు సోకుతున్నందున గ్రామపంచాయతీల్లో పరిశుభ్రత పాటించాలని ఈ విషయంలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించడంతో పాటు అధికారులు ఆకస్మికంగా గ్రామాల్లో తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. వీటితో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో సైతం పట్టణ ప్రగతి పనులు ఎంత మేరకు జరిగాయనే వివరాలను సంబంధిత మున్సిపల్ కమిషనర్లను అడిగి తెలుసుకొన్నారు. అలాగే పట్టణ ప్రగతిలో మురికి కాలువలు, కరెంట్ స్తంభాలు, వైర్ల మార్పిడి తదితర పనులు కొన్ని పెండింగ్లో ఉన్నాయని వాటి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లు, అధికారులను కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. అలాగే జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అనుమతి ఉన్న లే అవుట్లు ఎన్ని ? అక్రమ లే అవుట్లు ఎన్ని ? అనే వివరాలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం పల్లెప్రకృతి వనం, నర్సరీలు, డంపింగ్ యార్డుల పనులు ఎంత వరకు వచ్చాయనే వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తనకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మోహన్రావుతో మాట్లాడుతూ… సీఎం దత్తత గ్రామాల్లో పనుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఇప్పటి వరకు ఏఏ పనులు చేపట్టారు ఏఏ దశల్లో ఉన్నాయనే వివరాలను కలెక్టర్కు వివరించారు. గ్రామాల్లో పనులు పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకొన్నారు. దీనికి సంబంధించి నిధుల కొరత ఉన్నట్లయితే దీనికి సంబంధించి ప్రపోజల్స్ పంపితే నిధులు కొరత లేకుండా చూస్తామని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, జాన్శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్, జడ్పీ సీఈవో దేవసహాయం, పంచాయతీరాజ్ ఈఈ, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post