ప్రభుత్వ పధకాల సద్వినియోగంతో ఆర్ధిక పరిపుష్టి:: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్

ప్రభుత్వ పధకాల సద్వినియోగంతో ఆర్ధిక పరిపుష్టి:: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్

జనగామ ఆగస్ట్ 26 : ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకొని ఆర్ధిక పరిపుష్టి పొందాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్ అన్నారు. గురువారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమ మండలి వరంగల్ రీజియన్, జిల్లా పరిశ్రమలశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలు సంయుక్తంగా ప్రధానమంత్రి ఉపాధికల్పన పథకంపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఉపాధికల్పన పధకం ఉపాదితోపాటు ఉన్నతికి మార్గం చూపుతుందన్నారు. సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమలు, బేకరి షాప్, బ్యూటీ పార్లర్, టైలరింగ్, గ్రార్మెంట్స్ లాంటి ఎన్నో రకాల యూనిట్ల ఏర్పాటుకోసం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా ఋణాలు పొందవచ్చన్నారు. యూనిట్ల ఏర్పాటుకు సాంకేతిక శిక్షణను ప్రభుత్వం అందిస్తుoదన్నారు. గ్రామీణ ప్రాంతాల వారు తెల్ల రేషన్ కార్డ్ కల్గిఉండి, 8వ తరగతి వరకు చదివిన వారికి 40 రోజుల ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇట్టి పధకానికి పూర్తిగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మధ్యవర్తులు, దళారీలను ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ వర్గాల లబ్దిదారులకు ప్రాజెక్టు ఏర్పాటుచేసే ప్రాంతం పట్టణ ప్రాంతం వారైతే 15 శాతం, గ్రామీణ ప్రాంతం అయితే 25 శాతం, ఎస్సి, ఎస్టి, ఓబిసి, మైనారిటి, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, ఈశాన్య రాష్ట్రాలు, పర్వత, సరిహద్దు ప్రాంతాల వారైతే ప్రాజెక్టు ఏర్పాటుచేసే ప్రాంతం పట్టణమైతే 25 శాతం, గ్రామీణమైతే 35 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు ఒక్క యూనిట్ గా ఏర్పడి ఈ పథకాన్ని వినియోగించుకొని ఆర్ధికంగా ఎదగాలని అదనపు కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఉపాదికల్పన పధకంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సదస్సుకు వచ్చిన వారికి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిఎం పరిశ్రమలు కె. రమేష్, ఎల్డిఎం. టివి. శ్రీనివాస రావు, డిఆర్డిఓ జి. రాంరెడ్డి, , ఏపిడి. నూరొద్దిన్. కేవిఐసి డిడి శశి రంజన్ వర్మ, అధికారులు అశోక్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారీ చేయనైనది

Share This Post