ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇతర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం-2
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 15: విద్య, సంక్షేమ, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో నిర్మాణంలో ఉన్న పలు పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీక్షించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ (విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) అధికారులతో కలిసి కలెక్టర్ పలు పాఠశాలల్లో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో ప్రగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. సిరిసిల్ల పట్టణంలో నిర్మిస్తున్న వృద్ధాశ్రమం, అంబేద్కర్ భవనం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని సాంఘీక సంక్షేమ వసతి గృహాలన్నింటినీ తనిఖీ చేసి, వారం రోజుల్లోగా వసతి గృహాల్లో చేపట్టాల్సిన మరమ్మత్తు పనులపై ఉమ్మడి నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ వి. విరూపాక్ష, డీఈ సమ్మిరెడ్డి, సైట్ ఇంజనీర్లు శ్రీకాంత్, అశోక్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post