విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలనీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శనివారం రోజున ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని యాపల్ గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా విద్యాబోధనలో అంతరాయం కలిగిందని, ప్రస్తుతం కరోనా నిబంధనలు పాటిస్తూ, పాఠశాలలు పునః ప్రారంభం కావడం జరిగిందని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా విద్యాబోధన చేయాలనీ ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులను ప్రతి రోజు పాఠశాలలకు పంపించే విధంగా విద్యార్థుల తల్లితండ్రులకు తెలియజేయాలని అన్నారు. ప్రతి నెల మూడవ శనివారం రోజున పేరెంట్స్, ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించి విద్యాబోధన, పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనా వంటి అంశాలను సమీక్షించి చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు ఆన్ లైన్ ద్వారా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు, మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహారం అందించాలని అన్నారు. పరీక్షల సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి విద్యాబోధన చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలో ఈ విద్య సంవత్సరం లో ఉత్తీర్ణత శాతం రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలనీ అన్నారు. విద్యతో పాటు ఆటపాటలు, యోగ, వివిధ అంశాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. అనంతరం మధ్యాహం భోజన సమయంలో విద్యార్థులతో కలిసి అదనపు కలెక్టర్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్య శాఖ అధికారిని ప్రణీత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పోషకులు, తదితరులు పాల్గొన్నారు.