ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు వందశాతం ఉండేలా విద్యాశాఖాధికారులు రెండురోజులలోపు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు,02 ఖమ్మం:

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు వందశాతం ఉండేలా విద్యాశాఖాధికారులు రెండురోజులలోపు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ నుండి మండల విద్యా శాఖాధికారులతో నిర్వహించిన వీడియోవీడియో కాన్ఫరెన్స్ లో పాఠశాలలో విద్యార్థుల హాజరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రతి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రతి విద్యార్ధి పాఠశాలకు హాజరయ్యే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని పాఠశాలలలోకోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ విద్యాబోధన జరుగుచున్నదని, గత ఏడాదిన్నర కాలంగా విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్నారని ప్రస్తుత విద్యా సంవత్సరం వృథాకాకుండా పిల్లలందరిని పాఠశాలలకు పంపించే విధంగా తల్లిదండ్రులను ఒప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల పేద ప్రజలకు పాఠశాల పున: ప్రారంభం పట్ల సరియైన అవగాహన ఉండకపోవచ్చని, పాఠశాలల్లో విద్యార్థుల కొరకు తీసుకున్న కోవిడ్ నింబంధనల పట్ల తెలియపర్చి అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా ఆయా పాఠశాలలలో విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైన సబ్జెక్ట్ టీచర్లను డిప్యూటేషన్పై నియమించడం జరిగిందని, వారందరూ శుక్రవారం నుండి వారికి కేటాయించబడిన పాఠశాలలకు వెళ్ళే విధంగా మండల విద్యాశాఖాధికారులు ఈరోజే తగు చర్యలు తీసుకోని విధుల నుండి విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఉండాలని తదనుగుణంగా ఆయా పాఠశాలలకు కేటాయించబడిన ఉపాధ్యాయులు శుక్రవారం విధులకు హాజరు కావాలని లేనియెడల బాధ్యులపై చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. దీనితో పాటు ఇప్పటికే పాఠశాలలకు పంపిణీ చేయబడిన పాఠ్యపుస్తకాలను ప్రతి విద్యార్థికి అందజేయాలని, పాఠశాలలకు హాజరు కానటువంటి విద్యార్థి ఇంటికి వెళ్ళి పాఠ్యపుస్తకాలను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇతర సబ్జెక్టుల పాఠ్యపుస్తకాల కొరత ఉన్న యెడల గత సంవత్సరం విద్యార్థుల నుండి సేకరించి ప్రస్తుత సంవత్సరం అట్టి తరగతుల విద్యార్థులకు అందించాలని సూచించారు. అదేవిధంగా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా రెండు డోసులు కోవిడ్ టీకాలు వేయించుకొని ఉండాలని, వారితో పాటు -మధ్యాహ్నభోజన ఏజెన్సీ బాధ్యులు కూడా తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్ టీకా వేసుకొని ఉండేలా సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారితో పాటు మండల విద్యాశాఖాధికారులు ప్రతి పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే దిశగా ప్రయత్నం చేయాలని, రాబోయో రెండు రోజులలో ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పూర్తి స్థాయిలో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. చాలా కాలంగా ప్రత్యక్ష తరగతులకు విద్యార్ధులు దూరంగా ఉన్న కారణంగా తరగతులకు హాజరయ్యే విద్యార్థుల బోధన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ వంటి సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా ఇతర విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య, కమ్యూనిటీ మోబలైజేషన్ అధికారి రాజశేఖర్, మండల విద్యాశాఖాధికారులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post