బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలి  – జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని మాయ ఫంక్షన్ హాల్ లో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో ఏర్పాటు చేసిన రుణ విస్తరణ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితంలో పైకి రావడానికి పలు మార్గాలుంటాయని, కొందరు ఉద్యోగ మార్గాలు ఎంచుకోగా మరికొందరు వ్యాపారం వైపు దృష్టి సారిస్తారని, అట్టి వారు బ్యాంకులు అందించే రుణాలు అందిపుచ్చుకొని తమ వ్యాపారాలను విజయవంతంగా అభివృదిచేసుకొని సంపద సృష్టించుకున్నారని అన్నారు. కాబట్టి ఔత్సాహికులు ముందుకు వచ్చి బ్యాంకు రుణాలు పొంది, సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు రుణాలను తిరిగి బ్యాంకులకు సకాలంలో చెల్లించాలని సూచించారు. తద్వారా బ్యాంకు అభివృద్ధితో పాటు ప్రజలకు మరిన్ని రుణాలు అందచేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రధానంగా ఉపాధి యూనిట్లు ఏర్పాటు వల్ల ప్రజల ఆర్థిక అభివృద్ధితో పాటు జిల్లా ప్రగతిపదంలో పయనిస్తుందని కలెక్టర్ అన్నారు. రాష్ట్రంలో గాని, జిల్లాలో గాని స్వయం సహాయక బృందాలు రుణాలను పొందడంలో ముందుండడంతో పాటు వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకొని తిరిగి చెల్లిస్తూ ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఈ సందర్భంగా వివిధ బ్యాంకుల ద్వారా 270 కోట్ల 55 లక్షల రుణాలను లబ్దిదారులకు అందజేశారు. ఇందులో స్వయం సహాయక సంఘాలకు 108 కోట్ల 71 లక్షలు, మెప్మా పరిధిలోని సంఘాలకు 3 కోట్ల 66 లక్షలు కాగా ఇతర విద్య, గృహ, వాహన, పి ఏం.ఏ.వై తదితర రంగాలకు 130 కోట్ల 54 లక్షల రుణాలను అందజేశారు. అనంతరం వివిధ బ్యాంకులు ఏర్పాటుచేసిన స్టాల్ల్స్ ను తిలకించి ప్రారంబించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా జనరల్ మేనేజర్ జోగేష్ చంద్ర సాహు మాట్లాడుతూ కరోనా వలన ఆర్థికంగా దెబ్బతిని గత రెండు సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశం లోని అన్ని రాష్ట్రాలలో పండుగ వాతావరణం కల్పించేలా పెద్ద ఎత్తున రుణ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఇక్కడ 9 ప్రభుత్వ రంగ, 8 ప్రైవేట్ బ్యాంకుల ద్వారా స్టాల్ల్స్ ఏర్పాటు చేశామని, ఈ చక్కటి అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగ పరచుకొని తమ వ్యాపారాలను అభివృద్ధి పరుచుకొని దేశాభివృద్ధికో తోడ్పడవలసినదిగా కోరారు. ఈ మధ్య కాలంలో ఆర్ధిక సైబర్ నేరాలు అధికమయ్యాయని, వాట్సాప్, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తతంగా ఉండాలని, బ్యాంకులు ఎప్పుడు సంక్షిప్త రూపంలో మెస్సేజిలు మాత్రమే ఇస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, సి.బి.ఐ. రీజనల్ మేనేజర్ పంకజ్ కుమార్, గ్రామీణ బ్యాంక్ ఏ.జి.ఏం. బాలాజీ రావు, నాబార్డ్ ఏ.జి.ఏం. సెసిల్ తిమోతి, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ వేణుగోపాల్ రావు, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్,జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీశ్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, లబ్ధిదారులు, స్వయం సహాయక బృందాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post