మహిళల ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, అభ్యున్నతి కోసం ప్రభుత్వం అందించే రుణ సదుపాయాలను మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వాసవి భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మహిళా మహోత్సవం కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల అభ్యన్నతి, అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రకాల సదుపాయాలు కల్పిస్తుందని, ఇందులో భాగంగా జిల్లాలోని 185 స్వయం సహాయక సంఘాలకు 10 కోట్ల 10 లక్షల రూపాయల రుణ సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, స్రీనిధి పథకం క్రింద ఇచ్చిన రుణాలను సరైన విధంగా వినియోగించుకోవాలని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని, ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో మహిళా సంఘాల సభ్యులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని, గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాలు కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం రుణం పొందిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు సంబంధిత చెక్‌లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ కె.వి.ప్రసాద్, రీజనల్ మేనేజర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి, పి.డి. ఎం.సురేందర్, ఎ.పి.డి. శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కె. హనుమంతరావు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.