ప్రచురణార్థం
*ప్రభుత్వ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి:: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు*
*దేశంలో విద్యుత్ కోతలు లేని రాష్ట్రం తెలంగాణ*
*రైతుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.60 వేల కోట్ల పైగా ఖర్చు*
*కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా డిబిఎం 48లో సమృద్ధిగా నీరు*
*1000 కోట్లతో తండా గ్రామ పంచాయతీలలో బిటి రోడ్ల నిర్మాణం*
*ప్రతి తండాకు గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరు*
*రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్న 2 జాతీయ పార్టీలు*
*మహబూబాబాదులో ప్రభుత్వ వైద్య కళాశాల పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి*
మహబూబాబాద్, మే 10:-
ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.
మంగళవారం మహబూబాబాదులో ప్రభుత్వం మంజూరు చేసిన దాదాపు 510 కోట్ల అంచనా విలువతో వైద్య కళాశాల పనులకు, 3750.00 లక్షల అంచనా వ్యయంతో ఆసుపత్రి భవన పనులకు మంత్రి హరీష్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో మానుకోట సంఘటన, వీరోచితంగా పోరాడిన యువత స్ఫూర్తి జ్ఞాపకం ఉన్నాయని మంత్రి తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాగా మహబూబాబాద్ ఏర్పాటు చేశామని, 550 కోట్లతో వైద్య కళాశాల మంజూరు చేసుకుని పనులకు శంకుస్థాపన చేసుకున్నామని మంత్రి తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 3 ప్రభుత్వ కళాశాలలు, 700 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నాయని, *సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యల కారణంగా 33 జిల్లాలో 33 వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ప్రస్తుతం 2840 మెడికల్ సీట్లు ఉన్నాయని, 1 సంవత్సర కాలంలో 5420 సీట్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి హరీష్ రావు తెలిపారు*
5 సంవత్సరాల కాలంలో మహబూబాబాద్ ప్రాంతం ఎమ్మెల్యే నాయకత్వంలో మంచి అభివృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. భవిష్యత్తులో మహబూబాబాద్ ప్రాంతంలో 650 పడకలతో 100 వైద్యులతో జిల్లా ఆసుపత్రి అందుబాటులో ఉంటుందని, దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ప్రభుత్వ ఆస్పత్రులలో అవసరమైన అన్ని రకాల మందులు, పరీక్ష యంత్రాలు అవసరమైన పరికరాలు అందుబాటులో ఇస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తండాలో నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిందని, రూ.1000 కోట్ల నిధులను ఖర్చు చేసి తండాలలో బిటి రోడ్లు వేస్తున్నామని, ప్రతి తండాకు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిరోధకులుగా 2 జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటి మయం అవుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారని, *ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాలలో 6 గంటలు , ఢిల్లీ ప్రాంతం లో సైతం విద్యుత్ కోతలు ఉన్నాయని, తెలంగాణ ప్రాంతంలో 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందిస్తున్నామని అన్నారు*
రైతుల సంక్షేమం కోసం దేశంలో అత్యధికంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని, ధాన్యం కొనుగోలు బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరించినప్పటికీ రూ.3 వేల కోట్ల నష్టం తో ధాన్యం కొనుగోలు ప్రారంభించారని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం రైతుబంధు పథకానికి రూ.15 వేల కోట్లు, రైతు బీమా పథకానికి రూ.1500 కోట్లు, 24 గంటల విద్యుత్ సబ్సిడీ కోసం రూ.12 వేల కోట్ల, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.30 వేల కోట్ల, మార్కెట్లలో గోదాముల నిర్మాణం, రైతు వేదికల నిర్మాణం, సబ్సిడీ విత్తనాలు సరఫరా , ఉద్యానవన పంటల ప్రోత్సాహకం కింద అధిక నిధులు ఖర్చు చేస్తున్నామని మంత్రి అన్నారు. *దేశంలోనే అత్యధికంగా రైతుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం రూ.60 వేల కోట్లకు పైగా నిధులను సీఎం కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని మంత్రి తెలిపారు* రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో వీటిలో సగం సైతం ఖర్చు చేయడం లేదని, వారు రైతుల పట్ల మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి స్పష్టం చేశారు.
కొందరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకు సాగునీరు అందలేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, వారికి డీబిఎం 48 కాలువ కనిపించడం లేదని అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు ,రైతు బీమా, కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ కెసిఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నయా పైసా అందించక పోయినా తామే నిధులు అందిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మంత్రి అన్నారు. *అబద్ధాలు ప్రచారం చేయడంలో వారికి నోబెల్ బహుమతి అందించాలని, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయకపోవడం వారి అసమర్థత అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు* ప్రజలకు మంచి పనులు అభివృద్ధి చేసి ప్రచారం చేసుకోవాలని మంత్రి తెలిపారు.నూతన జిల్లాలో నవోదయ పాఠశాలలు ఏర్పాటుకు చట్టం సూచిస్తూ నప్పటికీ మంజూరు చేయడం లేదని మంత్రి ఆరోపించారు. అబద్ధాల ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
*మహబూబాబాద్ జిల్లా కు మంత్రి రూ 8.6 కోట్ల నిధులు మంజూరు*
మహబూబాబాద్ జిల్లాలో వైద్య సదుపాయాల అభివృద్ధి కోసం మంత్రి హరీష్ రావు దాదాపు రూ.8.6 కోట్ల నిధులను మంజూరు చేశారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోరిన విధంగా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.2.2 కోట్లు, అయోధ్య పురం పీహెచ్సి నిర్మాణానికి రూ.2.2 కోట్లు, 15 ఏ ఎన్ ఎం సబ్ సెంటర్ల నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున మంత్రి మంజూరు చేశారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ కోరిన విధంగా మరిపెడ ఆసుపత్రి త్వరలో అప్గ్రేడ్ చేస్తామని, నరసింహుల పేట గ్రామంలో పల్లె దవాఖాన ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి మంజూరు చేశారు. తొర్రూరు ఆసుపత్రిలో సైతం త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, మహబూబాబాద్ ప్రాంత అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీగా చేపట్టిందని అన్నారు. గ్రామ పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు చేసే సమయంలో మహబూబాద్ జిల్లా కు అధిక ప్రాధాన్యం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో త్వరలో ప్రభుత్వం 3వేల ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామని, 57 ఏళ్లకు పెన్షన్ నిధులు సైతం త్వరలో విడుదల చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర గిరిజన మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, 550 కోట్ల ఖర్చుతో జిల్లాలో వైద్యకళాశాల పనులకు శంకుస్థాపన చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎసార్ఎస్పి నీళ్లు మా ప్రాంతానికి వచ్చిన దాఖలాలు లేవని, 104 కోట్లతో కాలువల మరమ్మతులు లైనింగ్ పనులు పూర్తిచేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చిట్ట చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో 7.2 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు ప్రారంభించామని, పిల్లల కోసం ఐసియూ కేంద్రాలు ఏర్పాటుచేశామని, 40 కోట్లతో నర్సింగ్ కళాశాల పనులు పూర్తి చేశామని మంత్రి తెలిపారు.
మహబూబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత, జిల్లా కలెక్టర్ శశాంక్, మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్, ఎమ్మెల్యే రెడ్యానాయక్ , ఎమ్మెల్సీ రవీందర్ , మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
——————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.