ప్రభుత్వ సదుపాయాలపై వయో వృద్దులకు అవగాహన కల్పించాలి:: అదనపు కలెక్టర్ అబ్దుల్ హామీద్

జనగామ, అక్టోబర్ 8: వయో వృద్దులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ప్రత్యేక సదుపాయాల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వయోవృద్ధులను గౌరవించి, వారికి సముచిత స్థానం కల్పించాలన్నారు. అన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ పిల్లల భాధ్యతని ఆయన స్పష్టం చేసారు. జిల్లాలో తల్లితండ్రుల, వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమం చట్టం -2007, నియమావళీ -2011 పై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన అన్నారు. కుటుంబ విలువలతో భారతీయ సంస్కృతి ఏర్పడిందని, తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రత్యేకంగా చట్టం తీసుకొని వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. తల్లిదండ్రులకు కావాల్సిన కనీస అవసరాలను పిల్లలు తీర్చాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం నేరమవుతుందని, ఈ చట్టం ప్రకారం వయోవృద్దులు తమకు ఉన్న సమస్యలు స్థానిక తహసిల్దార్ / ఆర్డివో కు ఫిర్యాదు చేస్తే వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో తల్లిదండ్రుల పోషణ చట్టం పై జిల్లాలో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం 14567 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిందని, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్ చేసి ఒంటరితనం, నిర్వహణ సమస్యలు, చట్ట సలహాలు, పెన్షన్ సమస్యలు, సమాచారం, సహాయం కొరకు సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. అనంతరం కార్యక్రమంలో వయోవృద్దులను అదనపు కలెక్టర్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి జయంతి, డిఆర్డీవో జి. రాంరెడ్డి, జిల్లా విద్యాధికారి కె. రాము, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ సుగుణాకర్ రాజు, జిల్లా ఉప వైద్య ఆరోగ్యాధికారిణి డా. కరుణశ్రీ, జిల్లా వయోవృద్ధుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజయ్య, బతుకమ్మ ఫౌండేషన్ అడ్వైజర్ భాస్కర్, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post