ప్రమాదం వాటిల్లితే ప్రజలను ఏ విధంగా రక్షించాలనే ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

బుధవారం అశ్వాపురంలో హెవీ వాటర్ ప్లాంటు విశ్రాంతి భవనంలో నిర్వహించిన ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అయిన జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. హైడ్రోజన్ సల్ఫైడ్ లీకైన సమయంలో ప్లాంటు పరిసర ప్రాంత ప్రజల ప్రాణ రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక, రెవిన్యూ, సైట్ ఇంజనీర్లుతో ముఖాముఖి నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాంటుకు 5 కిలోమీటర్లు పరిధిలో ఉన్న గ్రామ ప్రజలకు రక్షణ చర్యలపై ప్రతి 6 నెలలకు ఒక సారి గ్రామస్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్లాంటుకు 5 కిమీ పరిధిలో నూతనంగా ఏర్పడిన నూతన అవాసాలు, పెరిగిన జనాభాపై రెవిన్యూ, ప్లాంటు అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి తనకు నివేదికలు అందచేయాలని చెప్పారు. వాయువు లీకైన సందర్భంలో చిన్నోళ్ల నుండి పెద్దోళ్ల వరకు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో సమగ్ర అవగాహన ఉండాలని చెప్పారు. వాయువు విడుదలైన సమయంలో ప్రజలకు ఏ విధమైన లక్షణాలుంటాయో ఏం చర్యలు తీసుకోవాలన్న అంశంపై అవగాహన కల్పించాలని చెప్పారు. పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వాయువు లీకైన సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన చర్యలను ప్రదర్శింప చేయాలని చెప్పారు. వాయువు లీకైన సందర్భంలో ప్రజలకు తక్షణ వైద్య సేవలందించేందుకు వైద్యులను, పరికరాలు, వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రజలకు తక్షణ వైద్య సేవలందించేందుకు సమీపంలోనే షెల్టర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలకు సమాచారం అందించేందుకు పరిసర గ్రామాల్లో ల్యాండ్ ఫోన్లు ఏర్పాటు చేయాలని, సెల్ఫోన్లు వల్ల సిగ్నల్స్ సమస్య వచ్చే అవకాశం ఉన్నందున ల్యాండ్ ఫోన్లు వినియోగించాలని చెప్పారు. వాయువు లీకైన సందర్భంలో ప్రజలను తక్షణం అప్రమత్తం చేసేందుకు గ్రామస్థాయిలో పటిష్టమైన సమాచార వ్యవస్థ ఉండాలని చెప్పారు. వాయువు యొక్క శాతాన్ని కొలిచే పరికరాలు సిద్ధంగా ఉండాలని, అందుబాటులో లేనట్లయితే తక్షణం కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు అందచేయాలని కాలుష్య నియంత్రణ అధికారులను ఆదేశించారు. విపత్తు సంబవించిన సమయంలో ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా సన్నద్ధతగా ఉండాలనే అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించాలని చెప్పారు. రక్షణ విషయంలో ఎంత సన్నద్ధతగా ఉన్న ప్రజలకు అవగాహన ఉండాలని చెప్పారు. లైఫ్ లాస్ కావడానికి వీల్లేదని, ప్రాణాలను తిరిగి ఇవ్వలేమని రక్షణలో రాజీ పడొద్దని ఆయన పేర్కొన్నారు. మనం అనుకోని సమయంలోనే ప్రమాదం వాటిల్లుతుందని, ఏ సమయంలోనైనా ప్రజల్ని రక్షించుకోవడానికి అవలంబించాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. విపత్తు వస్తే ఏ విధంగా ఎదుర్కొవాలో సన్నద్ధత చాలా ముఖ్యమని చెప్పారు. వాయువు లీకైన సందర్భంలో అలారం రాగానే నిమిషాల్లోనే ప్రజలను అప్రమత్తం చేసి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడుటలో జిల్లా యంత్రాంగం ఎల్లపుడూ అప్రమత్తంగా ఉంటుందని చెప్పారు. గోదావరి వరదల సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించామని, అది ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. అదే విధంగా ప్రజలకు ప్రతి ఆరు నెలలకు మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం చేపడుతున్న రక్షణ చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. వాయువు లీకైన సందర్భంలో ప్రజలకు అందించే తక్షణ చర్యల యొక్క పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసియాలో చాలా పెద్దదైన ప్లాంటు మన జిల్లాలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, భార జల ప్లాంటు మన జిల్లాకు మణిహారంగా ఉన్నదని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్లాంటు మొత్తం కలియ తిరిగి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో జియం సతీష్, ముఖ్య పరిపాలన అధికారి కాంబ్లే, డిజియం సుధాకర్, మెడికల్ సూపరింటెండ్ డాక్టర్ విజయకుమార్, కమాండెంట్ మీనా, కాలుష్య నియంత్రణ ఈఈ శంకర్బాబు, తహసిల్దార్ సురేష్ కుమార్, వైద్యాధికారి మణికంఠారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post