ప్రవాస భారతీయులు తమ స్వంత జిల్లాకు సేవలందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధం

జనవరి,07 ఖమ్మం:

ప్రవాస భారతీయులు తమ స్వంత జిల్లాకు సేవలందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ప్రవాసి దివస్ ను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఖమ్మం జిల్లా ప్రవాస భారతీయుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు టెలివిజన్లు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు మెడికల్ కిట్స్ వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఇట్టి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పాల్గొని టెలివిజన్ లను, మెడికల్ కిట్స్న సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లా నుండి విదేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు తాము పుట్టిన జిల్లా ఊరి అవసరాలను జిల్లా ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ ద్వారా గుర్తించి అవసరమైన వస్తువులను అందించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. విదేశాలలో ఆచరిస్తున్న మంచి పద్ధతులు, విద్యా వ్యవస్థ, ఐడియాలను ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ వారికి తెలియజేసి, మన జిల్లా విద్యార్థులు కూడా ఆధునిక పద్ధతుల ద్వారా విద్యా, విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సహకరిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలోని 18 వందల అంగన్ వాడీ కేంద్రాలలో చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు పాఠశాలకు వెళ్ళే ముందు అవసరమైన విద్యాబుద్ధులు నేర్పించి, పాఠశాల స్థాయి విద్యాబోధనకు సంసిద్ధం చేయడం జరుగుతుందని, ప్రస్తుతం ప్రవాసభారతీయులు అందిస్తున్న టెలివిజన్ల ద్వారా చిన్నారులకు, విద్యా, విజ్ఞానంతో పాటు, ఆటలను నేర్పించేందుకు ప్రతిరోజు ఒక గంట సమయాన్ని కేటాయించాలని అంగన్ వాడీ టీచర్లకు కలెక్టర్ సూచించారు. ఒమిక్రాన్, కోవిడ్-19 మూడవ దశ నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం ప్రత్యేకంగా పి.పి.కిట్స్, మాక్స్లులు, గ్లౌసెస్ , పేషెంట్లకై వైద్య చికిత్స పరికరాలు, పల్స్ ఆక్సిమీటర్లు అందించడం మంచి పరిణామంగా కలెక్టర్ తెలిపారు.

ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ అధ్యక్షులు బోనాల రామకృష్ణ, కార్యదర్శి బండి నాగేశ్వరరావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా॥ మాలతీ, జిల్లా సంక్షేమ అధికారి సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్లు, సి.డి.పి.ఓలు, వైద్యాధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post