ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

మంగళవారం నాడు స్థానిక సంస్థల కలెక్టర్ ప్రతిమ సింగ్ రామాయంపేట లో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా నిజామాపేట్ మండలం చెల్మెడ లో బృహత్ పల్లె ప్రక్రుతి వనాన్ని, నర్సరీలను, మన ఊరి మన బడి క్రింద ఎంపిక చేసిన పాఠాశాలను, నిజాంపేట్ గ్రామ పంచాయతీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 6,522 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 6,005 మంది హాజరయ్యారని, 517 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, మొత్తంగా 92 శాతం విద్యార్థుల హాజరు శాతం నమోదయ్యిందని ఆమె తెలిపారు. ఇందులో 5,564 మంది జనరల్ విద్యార్థులు కాగా, 441 మంది ఒకేషనల్ విద్యార్థులున్నారని అన్నారు. కాగా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేవని ప్రతిమ సింగ్ స్పష్టం చేశారు. కాగా త్వరలో చేపట్టబోయే హరితహారానికి కావలసిన మొక్కలు నర్సరీలలో సిద్దంగా ఉంచాలని, ప్రకృతి వనాలు, నర్సరీలలో మొక్కల జెర్మినేషన్ బాగా ఉండేలా చూడాలని, మొక్కలు ఎడిపోకుండా నీళ్లు పోయాలని, చనిపోయిన మొక్కల స్థానంలో తిరిగి మొక్కలు నాటాలని సూచించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించుటకు గాను తొలివిడతగా మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చెల్మెడ లో ఎంపిక చేసిన పాఠశాలను సందర్శించి అవసరమైన పనులు చేపట్టుటకు సరైన అంచనా విలువలు రూపొందించి పరిపాలన ఆమోదం పొంది వెంటనే పనులు చేపట్టుటకు చర్యలు తీసుకోవలసిందిగా అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏం.పి .డి.ఓ. తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Share This Post