ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి:: డిసిపి బి. శ్రీనివాస రెడ్డి

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి:: డిసిపి బి. శ్రీనివాస రెడ్డి

జనగామ, సెప్టెంబర్ 6: ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించడానికి శాంతి కమిటీ సభ్యుల సూచనల మేరకు సంబంధిత శాఖలతో సమన్వయంతో చర్యలు తీసుకోనున్నట్లు డిసిపి బి. శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు తో కలిసి గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ, గణేష్ ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని అన్నారు. నిమజ్జన రహదారి మరమ్మత్తు, లైటింగ్ ఏర్పాటుచేయాలన్నారు. గణేష్ విగ్రహాల వద్ద, శోభాయాత్ర సమయంలో డిజె సౌండ్ సిస్టంకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. గణేష్ విగ్రహాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఆయన సూచించారు. గతంలో గణేష్ మండపాలు ఏర్పాటుచేసిన ప్రదేశాల్లోనే ఇప్పుడు ఏర్పాట్లు చేయాలని, క్రొత్త చోట్ల ఏర్పాటుకు అనుమతి లేదని ఆయన అన్నారు. వర్షాలు కురుస్తుండడంతో మండళ్ళ వద్ద చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. విద్యుత్తు అధికారులతో సమీక్షించి, పటిష్టంగా నాణ్యమైన వైర్ తో విద్యుత్ సౌకర్యం పొందాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని గణేష్ మండపాల వద్ద పోలీసు పెట్రోలింగ్ పకడ్బందీగా అమలు చేస్తామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ పికెటింగ్ ఉంటుందన్నారు. అన్ని గణేష్ మండపాలను జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు, గణేష్ నిర్వాహకులు 24 గంటల పాటు గణేష్ మండపాల వద్ద రక్షణగా వాలంటీర్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
సమీక్ష లో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మండపాల వద్ద కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, గణేష్ మండపాల వద్ద శానిటేషన్ తప్పనిసరిగా చేయాలన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోనెలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రమాదాలు జరగకుండా స్టేజి ధృడంగా ఉండేలా చూడాలని అన్నారు. భారీ వర్షాలతో జలాశయాలన్ని నిండుకుండల్లా మారాయని, విగ్రహాల సైజును తక్కువగా ఉండేలా, పర్యావరణానికి హాని కలగకుండా, ప్లాస్టిక్ వినియోగం అరికట్టాలని ఆయన అన్నారు. అధికారులు సమన్వయంతో ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు చేపడతామన్నారు.
ఈ సమావేశంలో ఆర్డీవోలు మధు మోహన్, కృష్ణవేణి, ఏసీపీ వినోద్ కుమార్, డిపివో రంగాచారి, వివిధ శాఖల అధికారులు, గణేష్ నిమజ్జన కమిటీ సభ్యులు పోకల లింగయ్య, శ్రీనివాసులు, జయహరి, రామకృష్ణ, నర్సయ్య, నాగరాజు, పాండు, ఆంజనేయులు, దయాకర్, రవీందర్, నర్సింగ్, నర్సింహ రావు, బొట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post