ప్రశాంత వాతావరణంలో, భక్తి పూర్వకంగా వినాయక నిమజ్జనం:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రశాంత వాతావరణంలో, భక్తి పూర్వకంగా వినాయక నిమజ్జనం:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 15: జిల్లాలో ఈ నెల 19 న జరుగు వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో, భక్తిపూర్వకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిసిపి బి. శ్రీనివాస రెడ్డి తో కలిసి నిమజ్జన కమిటీ సభ్యులతో వినాయక నిమజ్జనం ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఏ పండుగ అయిన అన్ని మతాల ప్రజలు కలిసి మెలిసి సోదర భావంతో జరుపుకుంటారని అన్నారు. జనగామ శాంతి, సామరస్యానికి మారు పేరని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక నిమజ్జనాన్ని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో, సాంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు. రంగప్ప చెరువులో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నమన్నారు. స్వయం క్రమశిక్షణ చాలా అవసరమని, భక్తిపూర్వకమైన కార్యక్రమంలో ఇది ముఖ్యమని, ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. మన సంస్కృతిని భావి తరాలకు అందించేవి పండుగలని ఆయన అన్నారు. మనం వేసే అడుగులు భావి తరాలకు మార్గదర్శకంగా ఉండాలని, సమాజానికి ఒక మంచి ఇచ్చే విధంగా పండుగలు జరుపుకోవాలని కలెక్టర్ తెలిపారు. మండపాల నిర్వహణలో పండుగ జరుపుకొనే విధానాన్ని రాబోయే నవతరానికి చూపాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల వద్ద వాలంటీర్లు చూడాలని కలెక్టర్ అన్నారు.
సమీక్ష లో డిసిపి బి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, వినాయక నిమజ్జనాన్ని సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకొనుటకు పకడ్బందీ పొలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తక్కువ మందితో ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని, మాస్క్, భౌతిక దూరంతో మెలగాలని అన్నారు. భక్తుల రక్షణపై మండల వాలంటీర్లు శ్రద్ద వహించాలని ఆయన అన్నారు. వినాయక నిమజ్జనాన్ని జిల్లాలో ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకొనుటకు సహకరించాలని కోరారు.
ఈ సమీక్ష లో ఏసీపీ వినోద్ కుమార్, జనగామ సిఐ బాలాజీ వరప్రసాద్, వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post