ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి, నిమజ్జనం ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని హనుమకొండ, వరంగల్ కలక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపి సంయుక్తంగా పేర్కొన్నారు.

బుధవారం నాడు ఉదయం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులు, శాంతి కమిటీలతో కలెక్టర్లు, రాజీవ్ గాంధీ హనుమంతు, గోపీ, కమీషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషీ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హనుమకొండ కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ని జరుపుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధల తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. భక్తులు అందరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, శాంతి కమిటీల సభ్యులు అందరూ మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించాలని అన్నారు. గణేష్ మండపాలలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గణేష్ మండపానికి ఒక ఇన్చార్జిని నియమించాలని సూచించారు. ఈ సారి గణేష్ నిమజ్జనం కొరకు 13 పాయింట్లను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు . ప్రతి నిమజ్జన స్థలాలలో లైటింగ్, బ్యారికేడ్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు .జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు అన్ని చెరువులు, కుంటలు నీటితో నిండాయని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిమజ్జన పాయింట్ లో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు . అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా అగ్నిమాపక అధికారిని ఆదేశించారు.వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముందస్తుగా అందరూ గణేష్ మండలి నిర్వాహకుల పూర్తి వివరాలు అందించాలని కోరారు. ప్రతి మండపం యొక్క సమాచారం తప్పనిసరి అందించాలని, ఇది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు వర్షాలు కురుస్తుండడంతో మండపాల వద్ద చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సరిపోను క్రేన్ల లను ఉంచాలని, శానిటేషన్ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు,నిమజ్జనం రోజున మద్యం దుకాణాలు మూసీ వేయాలని అయన ఆదేశించారు.

కమిషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషిమాట్లాడుతూ… గణేష్ మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని గణేష్ మండలి వద్ద పోలీసు పెట్రోలింగ్ పకడ్బందీగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ దఫా వినాయక పండుగ కీ సంబంధించిన అన్ని అనుమతులను ఆన్లైన్ లోనే పొందాలని సూచించారు.

వరంగల్ కలెక్టర్ గోపి మాట్లాడుతూ వినాయకుల నిమజ్జనానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు ప్రణాళికాబద్ధంగా చేయాలని తెలిపారు. వినాయక నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని, వినాయక నిమజ్జన ప్రదేశాలలో వైద్య శిభిరాలను ఏర్పాటు చేయాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ తో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా జిల్లా వైద్యాధికారి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.వినాయక ఉత్సవాలు, నిమజ్జనం సoదర్బంగా అవసరమైన పారిశుద్ద్య పనులు పూర్తి చేయాలని అయన అధికారులను ఆదేశించారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ ప్రావీణ్యా మాట్లాడుతూ వినాయక చవితి సంధర్భంగా ఇరవై నాలుగు గంటలు శానిటేషన్ సిబ్బంది పని చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్, ఆర్డీవో లు వాసుచంద్ర, మహేందర్ జి, డిసిపి వెంకటలక్ష్మి, అడిషనల్ డిసిపి పుష్ప, హనుమకొండ, వరంగల్ జిల్లా ఉన్నత అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post